- రూ.12 వేల కోట్లకు చేరినా విడుదల చేయట్లేదు: రాంచందర్రావు
- ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తామన్న వెయ్యి కోట్లు ఏమయ్యాయి?
- ధర్నాలు చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయిస్తున్నారు
- విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారు
- ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ స్టేట్ చీఫ్ డిమాండ్
- పార్టీ స్టేట్ ఆఫీసులో దీక్ష ప్రారంభం.. ఎమ్మెల్యేలు, ఎంపీల సంఘీభావం
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. స్వయంగా విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని, వెంటనే తను పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పెండింగ్‌లో ఉన్న ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాంచందర్ రావు రెండు రోజుల దీక్షకు దిగారు. ఈ దీక్షకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీ నేతలు, విద్యార్థులు వచ్చి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫీజుల బకాయిలు ఏకంగా రూ. 12 వేల కోట్లకు చేరినా సర్కారుకు సోయి లేకుండా పోయిందని అన్నారు. విద్యార్థులు కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తుంటే వారిపై పోలీసులతో లాఠీచార్జ్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టిపోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పారని, కానీ ఇప్పటివరకు రూ.వెయ్యి ఇవ్వలేదని ఆరోపించారు. యూత్ డిక్లరేషన్ పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక విద్యార్థులను దారుణంగా మోసం చేశారని విమర్శించారు.
రాహుల్.. ఇక్కడికొచ్చి జవాబు చెప్పు
దేశమంతా తిరుగుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులను రెచ్చగొడుతున్న రాహుల్ గాంధీకి.. తెలంగాణ విద్యార్థుల కష్టాలు కనిపించడం లేదా అని రాంచందర్ రావు ప్రశ్నించారు. దమ్ముంటే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఫీజుల బకాయిలు, స్కాలర్ షిప్‌లపై ఇక్కడి విద్యార్థులకు జవాబు చెప్పాలని సవాల్ విసిరారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చే వరకు బీజేపీ పోరాటం ఆపదని హెచ్చరించారు.
కాంగ్రెస్‌కు యువత ఉసురు తగులుతది: ఎంపీ రేఖా శర్మ
బయట దీక్ష చేస్తే వేలాది మంది స్టూడెంట్లు తరలివస్తారనే భయంతోనే రేవంత్ సర్కారు రాంచందర్ రావు దీక్షకు పర్మిషన్ ఇవ్వలేదని ఎంపీ రేఖా శర్మ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి రూ.6 వేల కోట్లుగా ఉన్న ఫీజుల బకాయిలు ఇప్పుడు రూ.12 వేల కోట్లకు చేరాయన్నారు. రాహుల్‌గాంధీకి, రేవంత్‌రెడ్డికి ఇక్కడి విద్యార్థుల కష్టాలు పట్టించుకునే తీరిక లేదని ఎద్దేవా చేశారు.
అసలు బడ్జెట్లో ఎడ్యుకేషన్ కు నిధులు ఏవీ?: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన సాగిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని 30 వేల బడులకు 21 వేల స్కూళ్లలో కనీసం బాత్రూంలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని సమస్యలు పెట్టుకుని సీఎం మాత్రం ఏమీ పట్టనట్టు విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు.స్టూడెంట్లను ఉద్దేశించి ‘క్రిమినల్ వేస్ట్’ అని అనడం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఫీజుల బకాయిల కోసం చేస్తున్న దీక్షకు పర్మిషన్ ఇవ్వని రేవంత్ రెడ్డికి.. తన అమెరికా టూర్‌కు అనుమతి రాలేదని ప్రశ్నించే నైతిక హక్కు లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ ఎంపీ అర్వీంద్ మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా సీఎం కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగానే మూడేండ్లయినా బకాయిలు ఇవ్వడం లేదని రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య అనుమానం వ్యక్తం చేశారు. దీక్షకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు, సూర్యనారాయణగుప్తా, వెంకటరమణారెడ్డి, రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి తదితరులు సంఘీభావ ప్రకటించారు.
