LIC పాలసీదారులకు బిగ్ షాక్.. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ బంద్!

LIC పాలసీదారులకు బిగ్ షాక్.. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ బంద్!

దేశంలోని ఇన్సూరెన్స్ దిగ్గజం LIC పాలసీదారులకు ఊహించని షాకిచ్చింది. తన అధికారిక వెబ్‌సైట్ కస్టమర్ పోర్టల్‌లో క్రెడిట్ కార్డుల ద్వారా ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లించే సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో డిజిటల్‌గా క్రెడిట్ కార్డుల ద్వారా సులభంగా పేమెంట్స్ చేసే వారికి తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ప్రస్తుతం ఎల్ఐసీ ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, UPI ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పాలసీదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఈ నిర్ణయానికి ప్రధాన కారణం పేమెంట్ గేట్‌వే సంస్థలతో తలెత్తిన విభేదాలే అని తెలుస్తోంది. ఆన్‌లైన్ చెల్లింపుల కోసం ఎల్ఐసీ ఉపయోగించే బిల్‌డెస్క్ సేవలకు సంబంధించి వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలపై ఇరువర్గాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. గతంలో డెబిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌లకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకపోయినా.. క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు మాత్రం సర్వీస్ ఫీజు ఉండేది. అది కూడా పేమెంట్ చేసేముందు ఎంత అనేది అక్కడ చూపించేవారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎల్ఐసీ అధికారులు మరో కొత్త పేమెంట్ గేట్‌వే సంస్థతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

►ALSO READ | హమ్మయ్యా.. మంగళవారం దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే?

కొత్త వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి వస్తే క్రెడిట్ కార్డ్ చెల్లింపుల సదుపాయం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై ఎల్ఐసీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి పాలసీదారులు ఏజెంట్లు, ఎల్ఐసీ ఆఫీసుల ద్వారా లేదా ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్‌లో క్రెడిట్ కార్డులను లింక్ చేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రీమియంలు చెల్లించుకోవచ్చు.