టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వేదికగా సాగుతున్న పవర్ డ్రామా రోజు రోజుకు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అక్టోబర్ 11న జరగాల్సిన 'తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్' ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు సంచలన బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ధర్మాసనం ఊహించని షాక్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలపై సినీవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే?
తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో వివాదానికి ప్రధాన కారణం సంఘం రద్దు నిర్ణయం.. కొత్త కార్యవర్గం కోసం ఎన్నికల ప్రకటన. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెప్టెంబర్ 23న అసోసియేషన్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ మరుసటి రోజే అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
అయితే ఈ నిర్ణయాన్ని అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి సవాలు చేశారు. ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం డిసెంబర్ 6, 2027 వరకు ఉందని.. అంతకుముందే ఎన్నికలు నిర్వహించడం చెల్లదని ఆమె కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత కమిటీ కొనసాగేందుకు అనుమతించాలని, ఎన్నికలను నిలిపివేయాలని కోరారు.
ముందే విచారణ ఎందుకు జరపలేదు?
సెప్టెంబర్ 28న ట్రయల్ కోర్టు మధ్యంతర ఉపశమనం ఇవ్వకుండా.. ప్రతివాదికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది. అయితే అప్పటికే అక్టోబర్ 11న ఎన్నికలు జరగాల్సి ఉండటంతో.. ఎన్నికల తర్వాత విచారణ చేపడితే న్యాయపరమైన పరిష్కారం నిరర్థకంగా మారే ప్రమాదం ఉందని సుమలతా దేవి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అక్టోబర్ 8న జస్టిస్ ఎం.బి. లక్ష్మి ఈ పిటిషన్‌ను విచారించారు. మధ్యంతర రక్షణ ఎందుకు నిరాకరించారో ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టమైన కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. ఎన్నికలకు ముందే వివాదాన్ని విచారించే అవకాశం కల్పించాల్సిందని అభిప్రాయపడ్డారు.
అక్టోబర్ 30న తదుపరి విచారణ..
ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అక్టోబర్ 11 ఎన్నికలను నిర్వహించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫెడరేషన్‌కు నోటీసులు కూడా జారీ చేయాలని ఆదేశించింది. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 30న కేసు మరోసారి విచారణకు రానుంది. అప్పటివరకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది.
ALSO READ : శర్వానంద్ మాస్ జాతర మొదలైంది..
మొత్తానికి, టాలీవుడ్ డ్యాన్సర్ల సంఘంలో ఆధిపత్య పోరు, కార్యవర్గ పదవీకాలం, ఎన్నికల చెల్లుబాటుపై అసలు పోరు ఇక కోర్టులోనే తేలనుంది. అయితే హైకోర్టు ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులే కావడంతో, తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. అక్టోబర్ 30 విచారణపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
