గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి తొలగింపుతో నష్టం లేదు.. రిక్రూట్మెంట్ ప్లాన్స్ మారవన్న TCS

గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి తొలగింపుతో నష్టం లేదు.. రిక్రూట్మెంట్ ప్లాన్స్ మారవన్న TCS

అమెరికా ప్రభుత్వం తీసుకున్న సరికొత్త వీసా నిర్ణయాలు, శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్(PERM) నిలిపివేత అంశంపై భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్పష్టతనిచ్చింది. అమెరికా ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలు తమ కంపెనీ వర్క్‌ఫోర్స్ వ్యూహంపై గానీ, కస్టమర్ ఎంగేజ్‌మెంట్లపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోవని టీసీఎస్ వెల్లడించింది. 

గడచిన రెండేళ్ల కాలంలో తమ కంపెనీ తరఫున PERM కింద దరఖాస్తులు కేవలం సింగిల్ డిజిట్‌లోనే ఉన్నాయని టీసీఎస్ వెల్లడించింది. "అమెరికా ప్రభుత్వం పీఈఆర్ఎం కార్యక్రమంపై చేసిన ప్రకటనను మేం గమనించాం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ జారీ చేసే ఏ ఆదేశానికైనా టీసీఎస్ కట్టుబడి ఉంటుంది" అని టెక్ దిగ్గజం తన ప్రకటనలో పేర్కొంది.

స్థానిక నియామకాలే మా బలం: టీసీఎస్
అమెరికాలో తమ వర్క్‌ఫోర్స్ వ్యూహం పూర్తిగా అక్కడి అమెరికన్లను నియమించుకోవడంపైనే ఆధారపడి ఉందని టీసీఎస్ పునరుద్ఘాటించింది. బలమైన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ మోడల్ ద్వారా అమెరికాలోని 31 ఆఫీసులు, డెలివరీ సెంటర్లలో భారీ స్థాయిలో లోకల్ ఉద్యోగుల టీం ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించింది. రాబోయే 5 ఏళ్లలో అమెరికాలో అదనంగా మరో 15వేల మందిని నియమించుకోవాలని ప్లాన్ చేసినట్లు టీసీఎస్ తెలిపింది. గత 2 సంవత్సరాల్లో తమ దరఖాస్తులు చాలా తక్కువగా ఉండటం వల్ల.. ఈ ప్రోగ్రామ్ సస్పెన్షన్ తమ వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకి కాదని తేల్చిచెప్పింది.

హెచ్-1బి వీసా వ్యవస్థపై ట్రంప్ కఠిన చర్యలు..
హెచ్-1బి వీసా వ్యవస్థలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీసీఎస్ తో పాటు కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలను గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అమెరికన్ కార్మికులకు అన్యాయం జరిగేలా ఉన్న ఉపాధి పద్ధతులు, వీసా మోసాలను అణచివేయడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు యూఎస్ లేబర్ సెక్రటరీ కీత్ సోండర్‌లింగ్ వెల్లడించారు.

వీసా మోసాలపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ టెక్ కంపెనీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాలో భర్తీ చేయడానికి అసలు వీలుకాని అత్యున్నత నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులకోసమే హెచ్-1బి వీసా ప్రోగ్రామ్ ఉద్దేశించబడిందని గుర్తుచేశారు. అమెరికన్ కార్మికులకు వ్యతిరేకంగా వివక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఈ ప్రకటన ద్వారా కంపెనీలకు స్పష్టమైన సంకేతం పంపుతున్నామన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూనే.. వేలాదిగా హెచ్-1బి వీసాలు, గ్రీన్ కార్డ్‌ల లబ్ధి పొందుతోందని ఆరోపించారు.

అమెరికా ఆరోపణలు..
2009 నుంచి కేవలం ఈ కొన్ని కంపెనీలు మాత్రమే దాదాపు 30 లక్షల మంది విదేశీ కార్మికులను కోరాయని సోండర్‌లింగ్ తెలిపారు. వీరు 2లక్షల 30వేల పైచిలుకు హెచ్-1బి వీసా ఆమోదాలు, లక్షకు పైగా పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్‌లను పొందాయని పేర్కొన్నారు. దీనివల్ల భారీగా ఉద్యోగాలు అమెరికన్ కార్మికులకు దక్కకుండా పోయాయని ఆయన ఆరోపించారు. ఏదేమైనప్పటికీ.. అమెరికాలో ఇప్పటికే బలమైన స్థానిక బేస్‌ను ఏర్పరచుకున్న టీసీఎస్‌కు ఈ తాజా నిబంధనల వల్ల పెద్దగా నష్టం ఉండబోదని తెలుస్తోంది.