వికారాబాద్ జిల్లా పరిగిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పరిగి పట్టణంలోని తిరుమల రెసిడెన్సీ కాలనీలో వీధి కుక్కల గుంపు చిన్న పిల్లలపై విచక్షణారహితంగా విరుచుకుపడుతోంది. ఇళ్ల ముందు ఆడుకుంటున్న పిల్లలతో పాటు స్కూలుకు వెళ్తున్న చిన్నారులే టార్గెట్‌గా వరుస దాడులకు తెగబడుతున్నాయి. తిరుమల రెసిడెన్సీ కాలనీలో ఇప్పటికే వరుసగా నలుగురు పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. ఇందులో ఓ చిన్నారిని ఏకంగా గొంతు పట్టుకోగా, మరో చిన్నారి ముఖంపై కొరికి తీవ్ర రక్తగాయాలు చేశాయి.
తీవ్రంగా గాయపడిన చిన్నారులకు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వరుస దాడులతో పిల్లలను బయటకు పంపించాలంటేనే తల్లిదండ్రులు, కాలనీవాసులు బెంబేలెత్తిపోతున్నారు. వీధి కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా అధికారుల్లో చలనం లేకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కలను పట్టుకుని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
