పదేళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ( అక్టోబర్ 9 ) ఉదయం 5 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలతోపాటు వర్క్ షాప్ , బాడీ యూనిట్లలో కలిపి మొత్తం 115 పోలింగ్ స్టేషన్లను కార్మికశాఖ ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 12 కార్మిక సంఘాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
ప్రధానంగా టీడబ్ల్యూయూ, ఈయూ, ఎస్ డబ్ల్యూఎఫ్, టీఎంయూ, ఎన్ఎంయూ, టీజేఎంయూ, బహుజన వర్కర్స్ యూనియన్ లు గెలుపు కోసం పోరాడుతున్నాయి. సుమారు 36 వేల మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒకటి రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘం కోసం, మరోటి రీజియన్ స్థాయి గుర్తింపు సంఘం కోసం కార్మికులు ఓట్లు వేయనున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 17 న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.
హైదరాబాద్ లోని పలు డిపోల్లో ఇలా:
హైదరాబాద్ లోని ఉప్పల్ డిపో, చెంగిచెర్ల డిపో, ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్‌లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 5 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
ఉప్పల్ డిపోలో 634 మంది, చెంగిచెర్ల డిపోలో 645 మంది, ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్‌లో 209 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
కంటోన్మెంట్ డిపోలో:
కంటోన్మెంట్ డిపో పరిధిలో మొత్తం ఓట్లు 626 ఉండగా.. ఉదయం 9 గంటల సమయానికి 200 ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ పెరుగుతుందని భావిస్తున్నారు. సెకండ్ షిఫ్ట్ కార్మికులు డ్యూటి ఎక్కిన తర్వాత పోలింగ్ పుంజుకుంటుందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు, శ్రామికులు, ఆఫీసర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 3వేల 500 కాగా..ఇరు కూటములు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
