వెలుగు స్పెషల్ : భారత వ్యవసాయ రంగంపై అమెరికా కార్పొరేట్‌‌ ల డేగ కన్ను

వెలుగు స్పెషల్ : భారత వ్యవసాయ రంగంపై అమెరికా కార్పొరేట్‌‌ ల డేగ కన్ను

భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు కేవలం రెండు దేశాల మధ్య వస్తువుల కొనుగోలు,  అమ్మకాల వ్యవహారం కాదు.  ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై  దిగుమతి సుంకాల తగ్గింపు,  అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు  భారత మార్కెట్‌‌లో  మరింత ప్రవేశం కల్పించడం వంటి అంశాలు కోట్లాది  రైతుల జీవనంతో ముడిపడి ఉన్నాయి.  

ఇటీవల  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిందని  పేర్కొన్న నేపథ్యంలో,  వ్యవసాయానికి సంబంధించిన అంశాలను  రైతుల ప్రయోజనాలు, ఆహార భద్రత,  దేశీయ  స్వావలంబన కోణంలో  పరిశీలించాల్సిన అవసరం ఉంది.  భారత వ్యవసాయ నిర్మాణం ఈ ఆందోళనకు కారణాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
 
అధికారిక  వ్యవసాయ గణాంకాల ప్రకారం 2015–16 దేశంలోని మొత్తం వ్యవసాయ కమతాల్లో సుమారు 86 శాతం  చిన్న,  సన్నకారు కమతాలే.  వాటి  అధీనంలో ఉన్న సాగు విస్తీర్ణం సుమారు 47.4 శాతం.. అంటే భారత వ్యవసాయం ప్రధానంగా చిన్న కమతాలపై ఆధారపడి ఉంది.  ప్రతి కమతం వెనుక ఒక కుటుంబం, దాని జీవనాధారం, భవిష్యత్తు ఉంటాయి.  అందుకే చిన్న రైతుకు వ్యవసాయం కేవలం వృత్తి కాదు, కుటుంబాన్ని నడిపించే జీవన బండి.

దేశీయ రైతు ఉత్పత్తుల ధరలపై ఒత్తిడి

మన రైతుకు భూమి కేవలం ఆస్తి కాదు.  రైతు శ్రమకు, జీవనానికి, ఆత్మగౌరవానికి సన్మానం చేయడం అంటే భూమి తల్లికి సన్మానం చేయడం.  అలాంటి  వ్యవసాయరంగాన్ని  అంతర్జాతీయ మార్కెట్‌‌ పోటీకి మరింతగా తెరవడానికి ముందు ఆ పోటీని  తట్టుకునే స్థితిలో  మన రైతు ఉన్నాడా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.  అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్‌‌లో  మరింత  ప్రాప్యత కోరుతోంది. 

పాడి ఉత్పత్తులు, నూనెగింజలు, మొక్కజొన్న, పండ్లు వంటి ఉత్పత్తులపై  దిగుమతి  సుంకాలు,  మార్కెట్‌‌ ప్రాప్యత చర్చల్లో కీలక అంశాలుగా ఉన్నాయి.  సుంకాలు గణనీయంగా తగ్గితే  కొన్ని అమెరికా ఉత్పత్తులు భారత మార్కెట్‌‌లో తక్కువ ధరలకు అందుబాటులోకి రావచ్చు. వినియోగదారుడికి స్వల్పకాలిక ప్రయోజనం కలిగినా,  దేశీయ రైతు ఉత్పత్తుల ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. 

ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే.. అమెరికా తమ రైతుకు  ప్రభుత్వం తరఫున వివిధ రకాల ఆర్థిక మద్దతు, బీమా, సాంకేతికత, మౌలిక వసతులు అందిస్తున్నప్పుడు, చిన్న కమతాలు, అధిక ఉత్పత్తి వ్యయం, రుణభారంతో వ్యవసాయం చేస్తున్న భారత రైతును అదే మార్కెట్‌‌లో ఎలా సమాన పోటీకి నిలబెడతాం? మూలధనం, సాంకేతికత, సబ్సిడీలు, నిల్వ సామర్థ్యం, మార్కెట్‌‌ సమాచారం వంటి అంశాల్లో అసమానతలు ఉన్నప్పుడు దానిని సమాన పోటీగా పిలవడం సరికాదు.

పాడిరంగం విషయంలో మరింత జాగ్రత్త అవసరం

ఇప్పటికే రైతాంగం గిట్టుబాటు ధరలు, పంట నష్టాలు, అప్పులు, మార్కెట్‌‌ అనిశ్చితి వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. జాతీయ నేర గణాంక సంస్థ 2023 గణాంకాల ప్రకారం రైతులు, వ్యవసాయ కూలీలతో కలిపి 10,786 మంది  వ్యవసాయ రంగానికి చెందినవారు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 4,690 మంది రైతులు, సాగుదారులు కాగా, 6,096 మంది వ్యవసాయ కూలీలు.  ఈ నేపథ్యంలో చౌక దిగుమతుల ద్వారా మార్కెట్‌‌ ఒత్తిడిని మరింత  పెంచే నిర్ణయాలు తీసుకునేముందు వాటి ప్రభావాన్ని సమగ్రంగా అంచనా వేయాలి. పాడిరంగం విషయంలో మరింత జాగ్రత్త అవసరం. 

భారతదేశంలో కోట్లాది చిన్న రైతు కుటుంబాలకు, ముఖ్యంగా గ్రామీణ మహిళలకు పాడి పరిశ్రమ ముఖ్యమైన ఆదాయ వనరు. విదేశీ పాలపొడి, చీజ్‌‌ వంటి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌‌ కల్పిస్తే దేశీయ  పాడిరైతులపై ధరల ఒత్తిడి పెరగవచ్చు. అదే సమయంలో ఆహార నాణ్యత, ఆరోగ్య ప్రమాణాలు, పశుమేత మూలాలు,  వినియోగదారుల భద్రత వంటి అంశాల్లో శాస్త్రీయ ప్రమాణాలను 
కచ్చితంగా పాటించాలి.

విత్తనాల విషయంలోనూ అప్రమత్తం

విత్తనాల విషయంలోనూ అప్రమత్తత అవసరం.  విత్తనం రైతు ఉత్పత్తి ప్రక్రియకు పునాది.  పెద్ద కంపెనీల  ఆధిపత్యం పెరిగితే  రైతు విత్తనాల  విషయంలోనే  ఇతరులపై  ఆధారపడే  పరిస్థితి ఏర్పడవచ్చు. జన్యుమార్పిడి పంటలు, మేధోసంపత్తి హక్కులు,  జీవ వైవిధ్యం,  రైతుల విత్తన హక్కులపై శాస్త్రీయమైన, ప్రజాస్వామ్యబద్ధమైన చర్చ అవసరం. 

 భవిష్యత్తులో వాణిజ్య ఒత్తిళ్లు వచ్చినా దేశీయ జీవ వైవిధ్యం, రైతుల స్వావలంబన, ఆహార భద్రత విషయంలో రాజీపడకూడదు.  అసలు ప్రశ్న అమెరికా నుంచి ఎంత మొక్కజొన్న లేదా సోయాబీన్‌‌ దిగుమతి అవుతుందన్నది మాత్రమే కాదు. వ్యవసాయ ఉత్పత్తి, విత్తనం, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్‌‌, మార్కెటింగ్‌‌, ధర నిర్ణయించే శక్తి ఎవరి చేతుల్లోకి  వెళ్తుందన్నదే  కీలకం. 

పెద్ద పెట్టుబడులు సాంకేతికత,  నిల్వ, ప్రాసెసింగ్‌‌,  మార్కెటింగ్‌‌ వంటి రంగాల్లో రైతుకు ఉపయోగపడవచ్చు.  కానీ, మార్కెట్‌‌ నియంత్రణ కొద్దిమంది సంస్థల చేతుల్లో  కేంద్రీకృతమైతే రైతు బేరసారాల శక్తిని  కోల్పోయే  ప్రమాదం ఉంది.

రైతు వ్యవసాయాన్ని కోల్పోతే  గ్రామీణ ఆర్థిక వ్యవస్థ  బలహీనం

భారతదేశం  ప్రపంచంతో  వాణిజ్యం చేయకూడదని చెప్పడం పరిష్కారం కాదు. అంతర్జాతీయ మార్కెట్‌‌ రైతుకు కొత్త అవకాశాలు కూడా కల్పించగలదు.  అయితే  వాణిజ్య  సంబంధాలు రైతును  బలహీనపరిచేలా కాకుండా అతని ఆదాయం,  మార్కెట్‌‌ ప్రాప్యత,  బేరసారాల శక్తిని పెంచేలా ఉండాలి.  ఏ ఒప్పందమైనా పారదర్శకంగా,  పార్లమెంటరీ  పర్యవేక్షణతో,   రైతు సంఘాలు,  రాష్ట్రాలు,  వ్యవసాయ  నిపుణులతో సంప్రదించి రూపొందించాలి.

భారతదేశం  ప్రపంచ మార్కెట్‌‌లో  భాగస్వామి కావాలి,  కానీ  భారత రైతు చౌక ముడిసరుకు సరఫరా చేసే బలహీన భాగస్వామిగా మారకూడదు.  రైతు భూమిని కోల్పోతే  ఒక  కుటుంబ జీవనాధారం దెబ్బతింటుంది. రైతు వ్యవసాయాన్ని కోల్పోతే  గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది.  దేశం ఆహార స్వావలంబనను కోల్పోతే దాని ప్రభావం మొత్తం సమాజంపై పడుతుంది.   రైతును కాపాడటం అంటే ఆహార భద్రతను కాపాడటమే. 

 - ప్రొ. కొండా నాగేశ్వర్,ఉస్మానియా యూనివర్సిటీ -

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.