వెలుగు స్పెషల్ : అక్టోబర్ 9.. వరల్డ్ పోస్టల్‌‌ డే.. సమాచార వారధి పోస్టల్ నెట్‌‌వర్క్‌‌

వెలుగు స్పెషల్ : అక్టోబర్ 9..  వరల్డ్ పోస్టల్‌‌ డే.. సమాచార వారధి పోస్టల్ నెట్‌‌వర్క్‌‌

ప్రపంచంలోనే రెండవ అతి పురాతనమైన అంతర్జాతీయ సంస్థగా ‘యూనివర్సల్‌‌ పోస్టల్‌‌ యూనియన్‌‌’కు పేరుంది. ఈ సంస్థ 09 అక్టోబర్ 1874 రోజున స్విట్జర్లాండ్‌‌లో స్థాపించబడింది. ఈ చారిత్రాత్మక సంస్థ ఏర్పాటుకు గుర్తుగా 1969లో యూనివర్సల్‌‌ పోస్టల్‌‌ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి ఏటా 9 అక్టోబర్ రోజు ‘ప్రపంచ తపాలా దినోత్సవం’ లేదా వరల్డ్ పోస్టల్‌‌ డే పాటించడం ఆనవాయితీగా మారింది. 

2025 ప్రపంచ తపాలా దినోత్సవ ఇతివృత్తంగా ‘ఒక పోస్టల్ నెట్‌‌వర్క్‌‌,  అనంతమైన అవకాశాలు (వన్‌‌ పోస్టల్ నెట్‌‌నవర్క్‌‌, ఇన్‌‌ఫైనెట్‌‌ పాసిబులిటీస్)‌‌’ అనే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. పోస్టల్‌‌ సేవలతో ప్రపంచ సరిహద్దులు చెరిగిపోయాయి. గ్రామాలతో పట్టణాలు అనుసంధానం అయ్యాయి. 

మన ఊరి నుంచి పంపించిన పోస్టల్‌‌ కవర్స్‌‌‌‌ కొన్ని రోజుల్లో విదేశీ గమ్యస్థానాలకు చేరుతున్నాయి. నేటి డిజిటల్‌‌ యుగంలో వెలసిన అంతర్జాతీయ కొరియర్‌‌ సంస్థలతో ప్రభుత్వ తపాలా శాఖలు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. నేడు ఉత్తరాల బట్వాడా తగ్గడంతో ప్రభుత్వ పోస్టల్‌‌ విభాగాలు తమ విధులను పునర్‌‌ నిర్వహించుకోవడం తప్పనిసరి అయ్యింది. 

వేగంగా ఉత్తరాలను బట్వాడా చేయడంలో ప్రైవేటు కొరియర్‌‌ సంస్థలు ముందుంటున్నాయి. నమ్మదగిన సంస్థలుగా భద్రత విషయంలో ప్రభుత్వ తపాలా సేవలు నేటికీ కొనసాగుతున్నాయి. ప్రైవేట్‌‌ కొరియర్ కంపెనీలు లాభాపేక్షతో వ్యాపారం చేస్తున్నాయి. ప్రభుత్వ తపాలా సేవలు బాధ్యతగా మారుమూల ప్రాంతాల్లో సహితం తమ సేవలను అందిస్తూ, ప్రజల మన్ననలు పొందుతున్నాయి. పోస్ట్‌‌ అంటే నమ్మకం, విశ్వాసం. పోస్టల్‌‌ సేవలు ప్రపంచ మానవాళిని ఏకం చేస్తున్నాయి.  

- డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి 

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.