పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో శ్రీ తేజ్ ఎస్.కె దర్శకత్వంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘మయూఖ’ (Mayookha). భారీ అంచనాల మధ్య ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 9, 2026న) తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ పతాకంపై శశిధర్ ఈ మూవీని నిర్మించగా, క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కింది.
ముఖ్యంగా సినిమా విడుదలకు ముందే న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ (NYIFA) నుంచి బెస్ట్ మిస్టరీ ఫిలిం అవార్డు దక్కించుకోవడంతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. మరి ఈ ‘మయూఖ’ కథేంటి? ఆడియన్స్ కు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే?
హైదరాబాద్‌లో వరుసగా జరుగుతున్న హత్యలు పోలీసులకు సవాల్‌గా మారుతాయి. మరోవైపు, బ్యాంక్ ఉద్యోగిని మయూఖ తన ఫ్లాట్‌లో ఎవరో అపరిచిత వ్యక్తి సంచరిస్తున్నాడనే అనుమానంతో భయపడుతుంది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఆమెకు ఆశించిన సహకారం లభించదు. పరిస్థితులు మరింత అనుమానాస్పదంగా మారడంతో మయూఖ స్వయంగా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.
ఈ క్రమంలో అనుమానితులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తారు. కొన్ని సంఘటనలు కథను మరో మలుపు తిప్పుతాయి. అసలు మయూఖను భయపెడుతున్న వ్యక్తి ఎవరు? నగరంలో జరుగుతున్న హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఈ రెండు ప్రశ్నల చుట్టూ కథ సాగుతుంది.
విశ్లేషణ: థ్రిల్లింగ్ మూమెంట్స్
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 44లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వేలాడదీశారని పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతుంది. దీంతో పోలీసులు ఘననాస్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలిస్తారు. అక్కడ చెత్తను పడేసే నల్లటి కవర్లలో మనిషి శరీర భాగాలు ముక్కలుగా కనిపించడంతో షాక్ కు గురిచేస్తుంది. దీంతో ఈ కేసు మరింత సీరియస్ గా ఆసక్తిరంగా మారుతుంది. ఈ ఒక్క సీన్‌తోనే థ్రిల్లర్ లవర్స్‌కు ఒళ్ళు గగుర్పొడిచే రేంజ్‌లో కట్స్ పడ్డాయి.
మరో వైపు అర్ధరాత్రి పూట తన ఇంటి తలుపు ఎవరో పదేపదే కొడుతున్నారంటూ పాయల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు వచ్చి విచారిస్తే విస్తుపోయే నిజం బయటపడుతుంది. ఓ సైకో అమ్మాయి నరరూప రాక్షసిలా మనుషులను నరికి ముక్కలు చేయడం తాను ప్రత్యక్షంగా చూశానని పాయల్ చెప్పడంతో సస్పెన్స్ పీక్స్‌కు చేరుతుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? నగరంలో వరుసగా పడుతున్న శవాలకు, పాయల్‌కు ఉన్న సీక్రెట్ కనెక్షన్ ఏంటి? దానికితోడు ఊరిలో వింతగా కోళ్లు మాయమవ్వడానికి ఈ నరమేధానికి ఉన్న లింక్ ఏంటనేది థ్రిల్లింగ్లిగా చూపించారు. నరనరాల్లో వణుకు పుట్టించే సీన్లు, గూస్‌బంప్స్ తెప్పించే స్క్రీన్‌ప్లే ఈ సినిమాలో ఉన్నాయి.
ఫస్టాఫ్ ఎలా ఉంది?
సినిమా ప్రారంభంలోనే హత్యలు, అనుమానాస్పద పరిణామాలతో కథపై ఆసక్తి కలిగించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ ఎదుర్కొనే భయానక పరిస్థితులు, ఆమె చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన ప్రేక్షకుల్లో అనుమానాలను రేకెత్తిస్తాయి. ప్రతి పాత్రను అనుమానించేలా సన్నివేశాలను రూపొందించడం థ్రిల్లర్‌కు ఉపయోగపడింది.
అయితే, అనుమానితుల చుట్టూ కథ తిరగడం, కొన్ని సన్నివేశాలు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కథనం అక్కడక్కడా గందరగోళంగా అనిపిస్తుంది. అసలు మిస్టరీలోకి వెళ్లడానికి కొంత సమయం పట్టడం కూడా ఫస్టాఫ్‌కు ప్రతికూలంగా మారింది.
సెకండాఫ్ ఎలా ఉంది?
సినిమాలో అసలు చిక్కుముడులు వీడేది ద్వితీయార్థంలోనే. హత్యలకు సంబంధించిన ఆధారాలు, పాత్రల వెనుక దాగి ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ముఖ్యంగా హత్యల వెనుక ఉన్న వ్యక్తి గురించి వెల్లడయ్యే విషయాలు కథకు కీలకంగా నిలుస్తాయి.
దర్శకుడు ఎంచుకున్న క్రైమ్ నేపథ్యం, హత్యల వెనుక చూపించిన మానసిక కోణం కొత్తగా అనిపిస్తాయి. అయితే, కీలకమైన విషయాలను వెల్లడించడంలో తీసుకున్న సమయం, మధ్యలో వచ్చే కొన్ని సాగతీత సన్నివేశాలు ఉత్కంఠను కొంత తగ్గిస్తాయి. అయినప్పటికీ, క్లైమాక్స్‌లో అసలు రహస్యం బయటపడే విధానం థ్రిల్లర్ అభిమానులకు ఆసక్తిని కలిగిస్తుంది.
నటీనటుల పనితీరు..
మయూఖ పాత్రలో పాయల్ చెంగప్ప తనదైన నటనతో ఆకట్టుకుంది. భయం, అనుమానం, ఆందోళనతో సాగే పాత్రలో ఆమె ప్రదర్శన కథకు ప్రధాన బలంగా నిలుస్తుంది. అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్ తదితరులు తమ పాత్రల పరిధిలో నటించారు. ముఖ్యంగా అనుమానాలకు తావిచ్చే పాత్రల చిత్రణ కథలో ఉత్కంఠను కొనసాగించేందుకు ఉపయోగపడింది.
టెక్నీకల్ విభాగం
దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె. కథలోని మిస్టరీని తెరపై చూపించేందుకు ప్రయత్నించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం క్రైమ్ థ్రిల్లర్‌కు అవసరమైన వాతావరణాన్ని సృష్టించడంలో తోడ్పడ్డాయి. పాటల కంటే కథ, సన్నివేశాలపై ఆధారపడిన ఈ చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంపాక్ట్ తీసుకొచ్చింది. అయితే, ఎడిటింగ్ ఇంకాస్తా థ్రిల్లింగ్ గా ఉంటే కథనం మరింత వేగంగా సాగేది.
