వ్యక్తి నిరంతరం తాను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడే అభ్యున్నతిని సాధిస్తాడు.అలా సాధించిన వారే నిజమైన జీవనసాఫల్యాన్ని పొందుతారు. ఇలా అభ్యున్నతిని పొందాలంటే మనిషి ముందుగా తనలోని బలహీనతలను జయించాలి. అలాగే మరికొన్ని లక్షణాలను కలిగి ఉండాలని ద్వాపరయుంగంలో మహాభారతం సమయంలో విదురుడు దృతరాష్ట్రునికి వివరించాడు. ఇప్పడు వాటి గురించి తెలుసుకుందాం. .!
మహాభారతంలోని ఉద్యోగపర్వంలో విదురుడు మనిషి విడిచిపెట్టవలసిన ఆరు దోషాలను ధృతరాష్ట్రునికి ఉపదేశించాడు.
“షడ్దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా ।
నిద్రా తంద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రతా ॥”
భావం: అభ్యున్నతిని కోరుకునే మనిషి నిద్ర, తంద్ర, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రత అనే ఆరు దోషాలను జయించాలి.
1. నిద్ర ( క్రమశిక్షణ అవసరం): నిద్ర శరీరానికి అవసరమైన విశ్రాంతి. అయితే నిద్రాసక్తి వల్ల కర్తవ్యాలను నిర్లక్ష్యం చేయకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, క్రమశిక్షణ పాటిస్తూ శరీరానికి అవసరమైన విశ్రాంతిని తీసుకోవడం మంచిది. నిద్రను జయించడం కాదు.. నిద్రాసక్తిని మాత్రమే జయించాలి
2. తంద్ర (ఉత్సాహహీనతను విడిచిపెట్టాలి): తంద్ర అంటే నిద్రమత్తు, మగత, చురుకుదనం లేకపోవడం వంటి స్థితి. మనిషిలో శక్తి ఉన్నా ఉత్సాహం లేకపోతే ఆ శక్తి కార్యరూపం దాల్చదని మహాభారతం ద్వారా తెలుస్తుంది.చేయవలసిన పని తెలిసి కూడా “తర్వాత చూద్దాం” అనే నిర్లక్ష్య భావన పెరగకుండా చైతన్యంతో ముందుకు సాగాలి.
3. భయం ( ప్రయత్నాన్ని ఆపనివ్వకూడదు): ఏ పనైనా ..నేను చేయగలనా అని కాలపయాపన చేస్తే విఫలమవుతారు.. ఇతరులుఏమనుకుంటారో అనే భయాం మనిషిని ప్రయత్నానికి ముందే వెనక్కి లాగుతుంది. కాబట్టి ఎప్పటికి మనసులో అలాంటి ఆలోచనలు రాకుండా జాగ్రత్తలు పడాలి. భయం సహజమైన భావమే. కానీ భయం కారణంగా కర్తవ్యాన్ని వదిలిపెట్టడం అభ్యున్నతికి అడ్డంకిగా మారుతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదుభయం ఉన్నప్పటికీ ధర్మబద్ధమైన ప్రయత్నం చేయాలి.
4. క్రోధం ( వివేకాన్ని కాపాడుకోవాలి) : కోపం వచ్చినప్పుడు మనిషి ఆలోచించకుండా మాట్లాడతాడు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగే క్రోధం ... సంబంధాలను, అవకాశాలను, మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. కోపం వచ్చిన క్షణంలో వెంటనే స్పందించకుండా కొంత సమయం ఆగి, ఆలోచించి మాట్లాడటం వివేకానికి దారి తీస్తుంది. క్రోధాన్ని జయించినవాడు తనను తాను జయించినవాడే అవుతాడు.
5. ఆలస్యం ( పనిని వాయిదా వేయకూడదు): చేయవలసిన పని తెలిసినా దానిని రేపటికి వాయిదా వేయడం అలవాటైతే అవకాశాలు చేజారిపోతాయి. చిన్న పని అయినా సమయానికి పూర్తి చేయడం, క్రమంగా ముందుకు సాగడం అలసత్వాన్ని జయించడానికి మార్గమవుతుంది. ఏ పనైనా చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు.. వెంటనే ఆచరణలో పెట్టాలి.
6. దీర్ఘసూత్రత ( పనులను సాగదీయకూడదు) : ఇది చాలా ముఖ్యమైన దోషం. దీర్ఘసూత్రత అంటే కేవలం ఎక్కువగా ఆలోచించడం కాదు. చేయవలసిన పనిని అనవసరంగా సాగదీయడం, నిర్ణయాలను వాయిదా వేయడం, పూర్తి చేయవలసిన కార్యాన్ని ఎక్కువ కాలం లాగడం. ప్రతి పనికి ప్రణాళిక, ఆలోచన రెండూ అవసరం. కానీ ఆలోచన కార్యరూపం దాల్చినప్పుడే ఫలితం లభిస్తుంది.ఆలోచన వచ్చినప్పుడే నిర్ణయం తీసుకోగలుగుతాం.. ఆ నిర్ణయం కార్యరూపం దాలిస్తే ఫలితం వస్తుంది.
దోషాలకు విరుగుడు ఏమిటి?
- నిద్రాసక్తికి : క్రమశిక్షణ
- తంద్రకు : చైతన్యం, ఉత్సాహం
- భయానికి : ధైర్యం
- క్రోధానికి : సహనం
- ఆలస్యానికి : పట్టుదల
- దీర్ఘసూత్రతకు: సమయపాలన, కార్యాచరణ
మనిషి విడిచి పెట్టకూడనివి
ఈ ఆరు దోషాలను విడిచిపెట్టాలి. అయితే మనిషి విడిచిపెట్టకూడని ఆరు గుణాలు కూడా ఉన్నాయి.
- సత్యం
- దానం
- అనుకున్న పని వెంటనే చేయడం
- ఇతరులను చూసి అసూయ పడకూడదు
- క్షమించే గుణం కలిగి ఉండటం క్షమ
- ఓర్పు, ధైర్యం, దృఢ సంకల్పం , పట్టుదల కలిగి ఉండటం
నిజాయితీ, దాతృత్వం, శ్రమశీలత, ఇతరుల పట్ల అసూయ లేకపోవడం, క్షమాగుణం, ధైర్యం/స్థైర్యం వంటి సద్గుణాలను జీవితంలో నిలుపుకోవాలి.మనిషి బయట ప్రపంచాన్ని జయించడం కంటే ముందుగా తనలోని బలహీనతలను జయించాలి.
నిద్రాసక్తిని క్రమశిక్షణతో.. తంద్రను చైతన్యంతో..భయాన్ని ధైర్యంతో..క్రోధాన్ని సహనంతో.. ఆలస్యాన్ని పట్టుదలతో,దీర్ఘసూత్రతను కార్యాచరణతో జయించినప్పుడు మనిషి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదుగుతాడు.అప్పుడే అబ్యున్నతిని సాధిస్తాడు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
