కంటెంట్ బేస్డ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్.. తాజాగా ఓ హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. యామిరుక్కా భయమే, కరుంగాప్పియమ్ వంటి తమిళ హారర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు డీకే తన తదుపరి చిత్రాన్ని కూడా ఇదే జానర్‌లో రూపొందించనున్నాడట.
హారర్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అంతేకాదు, ఈ సినిమాతో నిత్యా మీనన్ నిర్మాతగానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ‘కేయూరి ప్రొడక్షన్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిత్యా మీనన్.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించబోయే తొలి సినిమా ఇదేనని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
నిత్యా మీనన్ గతంలో రాఘవ లారెన్స్ నటించిన ‘కాంచన 2’లో హీరోయిన్‌గా నటించింది. ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన ఏకైక హారర్ సినిమా ఇదే. ఇప్పుడు డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంతో దాదాపు 11 ఏళ్ల తర్వాత మరోసారి హారర్ జానర్‌లో నటించనుంది.
ALSO READ : జక్కన్నకు సినిమా చూపించవా బ్రో.
ఇప్పటివరకు సౌత్‌లో వచ్చిన హారర్ సినిమాలకు భిన్నంగా ఈ కథ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
