బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ షో వస్తుందంటే చాలు టీవీల ముందు వాలిపోతారు. ఇప్పుడు ఈ షో సెప్టెంబర్ 6 వ తేదీ నుంచి సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. అయితే అంతకంటే ముందే సామాన్యు ఎంపిక కోసం అగ్నిపరీక్ష ను నిర్వహిస్తున్నారు. అయితే 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2'లో పదో ఎపిసోడ్ అసలు ఆట ఇప్పుడే మొదలైందా? అన్నట్టుగా సాగింది. కంటెస్టెంట్ల మధ్య ఫిజికల్ పవర్‌తో పాటు స్ట్రాటజీ, టీమ్ గేమ్, డేంజర్ జోన్ టెన్షన్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. స్ట్రాంగ్ టీమ్, వీక్ టీమ్‌గా విడిపోయిన కంటెస్టెంట్లు చివరి దశ ఎంపిక ప్రక్రియలో గెలుపు కోసం గట్టిగానే పోరాడారు.
తొలి సమరం...
ఎపిసోడ్ ప్రారంభంలోనే రాజకుమారి తన వద్ద ఉన్న 'ఫైర్ కార్డ్' ఉపయోగించి ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం దక్కించుకుంది. మరోవైపు టాస్కుల్లో అద్భుతంగా ఆడిన శ్రష్టికి జ్యూరీ మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ గుర్తింపు ఇవ్వడంతో ఆమెకు కూడా ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ లభించింది. దీంతో ఇద్దరి మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
ఆర్మ్ రెజ్లింగ్, మ్యూజికల్ చైర్స్
ఆ తర్వాత అసలు ఫిజికల్ ఫైట్ మొదలైంది. రోహిత్, మిథిలేష్ మధ్య జరిగిన ఆర్మ్ రెజ్లింగ్‌లో రోహిత్ పైచేయి సాధించగా.. అమ్మాయిల విభాగంలో శ్రష్టి, అపూర్వను ఓడించి సత్తా చాటింది. అనంతరం మ్యూజికల్ చైర్స్‌తో పాటు పలు ఛాలెంజింగ్ టాస్కుల ద్వారా కంటెస్టెంట్లను స్ట్రాంగ్, వీక్ టీమ్స్‌గా విభజించారు.
స్ట్రాంగ్, వీక్ టీమ్..
వీక్ టీమ్‌లో ఒకరు ఎక్కువగా ఉండటంతో.. స్ట్రాంగ్ టీమ్‌కు కీలక పవర్ ఇచ్చారు. అందరూ కలిసి గాయత్రిని డేంజర్ జోన్‌లోకి పంపించడంతో ఆమెకు ఎల్లో కార్డ్ వచ్చింది. అయితే అదే గాయత్రికి తర్వాత మరో పవర్ దక్కింది. రెండు టీమ్స్‌కు లీడర్లను ఎంపిక చేసే అవకాశం ఇవ్వగా.. ఆమె స్ట్రాంగ్ టీమ్‌కు రోహిత్‌ను, వీక్ టీమ్‌కు దీపక్‌ను నాయకులుగా ఎంచుకుంది.
ALSO READ : నెట్‌ఫ్లిక్స్‌లో క్యూట్ లవ్.. అదిరిపోయే కామెడీ..
తాడు-తాళం టాస్క్‌లో..
ఇక తర్వాత జరిగిన తాడు-తాళం టాస్క్‌లో అసలు రచ్చ మొదలైంది. చేతులతో తాడును పట్టుకోవద్దని స్పష్టమైన రూల్ ఉన్నప్పటికీ.. రోహిత్ ఆ నిబంధనను ఉల్లంఘించాడన్న ఆరోపణలు వచ్చాయి. టాస్క్ మధ్యలో కంటెస్టెంట్లు కిందపడిపోవడంతో ఆటను ఆపి మరోసారి రూల్స్ వివరించారు. చివరకు రోహిత్ టీమ్ విజయం సాధించింది.
రివర్స్ ది డిసిషన్..
విజయం తర్వాత రోహిత్ ఓట్ అప్పీల్ కోసం శ్రష్టిని ఎంపిక చేశాడు. కానీ ఇక్కడే రాజకుమారి తన 'రివర్స్ ది డిసిషన్' కార్డ్ ప్లే చేసి గేమ్ మొత్తాన్ని తలకిందులు చేసింది. శ్రష్టికి బదులుగా తానే ఓట్ అప్పీల్‌కు వెళ్లేలా నిర్ణయాన్ని మార్చేసింది. అయితే కథ అక్కడితో ముగియలేదు. జ్యూరీ మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్గా మరోసారి శ్రష్టినే ఎంపిక చేయడంతో ఆమెకు కూడా ఓట్ అప్పీల్ చేసే అవకాశం దక్కింది.
చివర్లో రూల్స్ ఉల్లంఘించినందుకు రోహిత్‌కు ఎల్లో కార్డ్ పడింది. దీంతో ఒక్క ఎపిసోడ్‌లోనే రెండు ఎల్లో కార్డులు, రెండు ఓట్ అప్పీల్ అవకాశాలు, రివర్స్ కార్డ్ ట్విస్ట్ ప్రేక్షకులకు ఫుల్ హైడ్రామా ఇచ్చాయి. ఇప్పుడు ఈ అగ్నిపరీక్ష నుంచి అసలు బిగ్ బాస్ తెలుగు హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారన్నదే ఉత్కంఠగా మారింది.
