ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.2,840 కోట్ల చెల్లింపులు: ట్రస్ట్ సీఈవో

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు  రూ.2,840 కోట్ల చెల్లింపులు: ట్రస్ట్ సీఈవో

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లింపులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) జెండగే హనుమంత్ కొండిబా ఒక ప్రకటనలో తెలిపారు. 2023, డిసెంబర్ 8 నుంచి 2026, ఆగస్టు 23 వరకు ఆయా ఆస్పత్రులకు రూ.2,840 కోట్ల క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రభుత్వం చెల్లించిందని ఆయన వెల్లడించారు. 

గతంలో 2023, డిసెంబర్ కంటే ముందు నెలకు సగటున సుమారు రూ.54 కోట్లు మాత్రమే చెల్లించేవారని, ప్రస్తుతం ఆ సగటును రూ.88 కోట్లకు పెంచి సకాలంలో నిధులు విడుదల చేస్తున్నామని వివరించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు 18 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సీఈవో కొండిబా స్పష్టం చేశారు. ఉద్యోగులందరికీ 2026, జులై వరకు జీతాలు చెల్లించామని, ప్రస్తుతం ఎలాంటి పెండింగ్ బకాయిలు లేవని తెలిపారు.

ఆరోగ్యశ్రీ చికిత్స ధరలు 22శాతం పెంపు

రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ నగదు రహిత వైద్య సేవలు నిరంతరంగా అందుతున్నాయని, ఎక్కడా చికిత్సలు నిలిచిపోలేదని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో జెండగే హనుమంత్ కొండిబా పేర్కొన్నారు. 2023, డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య చికిత్స పరిమితిని ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్టు గుర్తుచేశారు.

 అదేవిధంగా 2024లో ఆరోగ్యశ్రీ ప్యాకేజీ రేట్లను సవరించి, 1,375 చికిత్సల ధరలను సుమారు 22 శాతం వరకు పెంచామని తెలిపారు. వీటికి అదనంగా కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో మొత్తం చికిత్సల సంఖ్య 1,835కు చేరిందన్నారు. పెరిగిన చికిత్సలు, ప్యాకేజీ ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం అదనంగా రూ.487.29 కోట్లను కేటాయించిందని సీఈవో జెండగే హనుమంత్ కొండిబా వివరించారు.