చందానగర్, వెలుగు: నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న కంకరపై జారిపడి మృతి చెందాడు. ఒంగోలుకు చెందిన శ్రీనివాసరావు(50) గౌతమీనగర్కాలనీలో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డుపై ఉన్న కంకరపై జారి కిందపడిపోయాడు.
ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో బాధితుడిని 108 సిబ్బంది కొండాపూర్ ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు.
ఎన్నికల ముందు హడావుడిగా రోడ్డు పనులకు ఫౌండేషన్ వేసి, 6 నెలలుగా పూర్తి చేయకుండా వదిలేశారని స్థానికులు ఆరోపించారు. రోడ్లను తవ్వి, కంకర కుప్పలుగా పోయడం వల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు కూడా లేవన్నారు.
