నాడు ఇండ్లు ఇస్తమంటే తీసుకోలే.. నేడు అడిగినా ఇస్తలే.. రాష్ట్రంలో పడకేసిన పీఎం ఆవాస్ యోజన

నాడు ఇండ్లు ఇస్తమంటే తీసుకోలే.. నేడు అడిగినా ఇస్తలే.. రాష్ట్రంలో పడకేసిన పీఎం ఆవాస్ యోజన
  • 2017 తర్వాత రూరల్‌‌‌‌లో ఒక్క ఇల్లూ మంజూరు చేయలె
  • కేంద్రం రూ. 500 కోట్లిస్తే వాడుకోని గత సర్కారు
  • ఇప్పుడు లక్షన్నర ఇండ్ల కోసం కేంద్రానికి ప్రభుత్వం విజ్ఞప్తి 
  • కేంద్ర ఫార్మాట్‌‌‌‌లోనే సర్వే చేసి వివరాల అందజేత 
  • కేంద్ర మంత్రిని కలిసిన సీఎం, బీజేపీ ఎంపీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో పేదల ఇండ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం అవలంబించిన తీరు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. అపుడు అన్ని రాష్ర్టాలకు కేంద్రం ఇండ్లు మంజూరు చేస్తే ఇక్కడి ప్రభుత్వ తీరుతో తెలంగాణకు ఇండ్లు మంజూరు కాలేదు. దీంతో 2017 నుంచి రాష్ర్టంలో పీఎం ఆవాస్ యోజన(రూరల్) పడకేసింది. 2018లో రాష్ర్టంలో పేదలు ఎంత మంది ఉన్నరు, ఎంత మందికి ఇండ్లు అవసరం అన్న అంశాలపై తమ ఫార్మాట్‌‌‌‌లో సర్వే చేసి వివరాలు అందచేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. 

ఈ ఆదేశాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మిగతా రాష్ర్టాలు సర్వే చేసి కేంద్రానికి వివరాలు అందించటంతో ప్రతి ఏటా ఆయా రాష్ర్టాలకు కేంద్రం ఇండ్లు మంజూరు చేసింది. తెలంగాణకు మాత్రం 2018 నుంచి ఇంత వరకు రూరల్‌‌‌‌లో కేంద్రం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. దీంతో గత రెండున్నర ఏళ్ల నుంచి రూరల్‌‌‌‌లో ఇండ్ల కోసం ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం మంజూరు చేయటం లేదు.

సర్వే చేసినా పట్టించుకోని కేంద్రం

2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇండ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. మరోవైపు కేంద్రం నుంచి వచ్చే ఏ స్కీమ్ నిధులను అయినా వదులుకోవద్దని ఇంకా అదనపు నిధులు ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2024లో రాష్ర్ట ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఫార్మాట్‌‌‌‌లో సర్వే చేసి వివరాలను అప్‌‌‌‌లోడ్ చేసింది. 

మొత్తం15 లక్షల మంది అర్హులు ఉండగా కేంద్రం ఇందులో 11.5 లక్షల మందిని అర్హులుగా తేల్చింది. అయినా అప్పటినుంచి ఇప్పటివరకు రూరల్‌‌‌‌లో కేంద్రం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. ఈ సర్వే ప్రకారం సుమారు 12 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి, రాష్ర్ట హౌసింగ్ మంత్రి పొంగులేటితో పాటు బీజేపీ ఎంపీలు కోరతున్నారు.

అయినా ఇండ్లు మంజూరు చేయటం లేదు. రూరల్‌‌‌‌లో పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం ఒక్కో ఇంటికి రూ. 72 వేలు సాయం చేస్తుంది. గత ప్రభుత్వంలో కేంద్రం నుంచి అన్ని రాష్ర్టాలు ఇండ్లు తీసుకొని నిర్మాణం కొనసాగిస్తున్నాయి. ఇపుడు ఇవ్వాలంటే అన్ని రాష్ర్టాలకు కలిపి ఇస్తామని గత రెండేళ్లుగా  కేంద్రం మెలిక పెడుతోంది. 2018 నుంచి తెలంగాణకు కేంద్రం రూరల్‌‌‌‌లో ఇండ్లు మంజూరు చేయలేదని రాష్ర్ట ప్రభుత్వం చెబుతున్నా కేంద్రం పరిగణనలోకి తీసుకోవటం లేదు. మరోవైపు గతంలో ఇచ్చినవే పూర్తి కాలేదని ఇతర రాష్ర్టాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. 

కేంద్రానికి డబ్బులు తిరిగిచ్చిండ్రు

2017లో పీఎం ఆవాస్ యోజన కింద రూరల్ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు రిలీజ్ చేసింది. అయితే, గత ప్రభుత్వం ఈ నిధులను వినియోగించుకోలేదు. కేంద్రానికి ఇన్‌‌‌‌టైమ్‌‌‌‌లో యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికేట్)లు పంపించలేదు. దీంతో నిధులు తిరిగి కేంద్రానికి పంపాల్సి వచ్చింది. అపుడు ఈ అంశం తీవ్ర వివాదాస్పదం అయింది.

 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఒక్కో ఇంటికి సుమారు రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఖర్చు అవుతుంటే రూ. 72 వేలు ఇస్తే ఎలా అని గత ప్రభుత్వం వాదించింది. గత ప్రభుత్వంలో కేంద్రం ఫార్మాట్ ప్రకారం సర్వే చేసి వివరాలు ఇచ్చి ఉంటే 2018 నుంచి ప్రతి ఏటా రాష్ర్టానికి సుమారు 65 వేల ఇండ్లు కేంద్రం రూరల్‌‌‌‌లో ఇచ్చేదని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. అప్పటి ప్రభుత్వ తీరు ఇప్పుడు పేదలకు శాపంగా మారిందని చెబుతున్నారు.

“2016 లో పీఎం ఆవాస్ యోజన కింద రాష్ర్టానికి 60 వేల ఇండ్లు మంజూరు అయ్యాయి. 2017లో రూ. 500 కోట్లు మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం ఆ నిధులను వినియోగించకపోవటంతో తిరిగి కేంద్రం ఖాతాలో జమ చేశాం. 2024లో కొత్త ప్రభుత్వం ఆదేశాల మేరకు కేంద్ర ఫార్మాట్‌‌‌‌లో సర్వే నిర్వహించగా సుమారు15 లక్షల మంది అర్హులుగా తేలారు. ఇందులో కేంద్రం 11.5 లక్షల అప్లికేషన్లను ఆమోదించింది. అయినా ఇండ్లను మంజూరు చేయటం లేదు” అని హౌసింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారి ‘వెలుగు’కు తెలిపారు. 

ఫైనల్ బిల్లులకు బ్రేక్

గత రెండేళ్ల నుంచి రూరల్‌‌‌‌లో రాష్ర్ట ప్రభుత్వం లక్షన్నర ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకున్నా 100 శాతం సబ్సిడీతో ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం వివిధ దశల్లో సాయం చేస్తోంది. ఇప్పటివరకు మొదటి దశ ఇండ్లకు రూ. 7 వేల కోట్లను లబ్ధిదారులకు రాష్ర్ట ప్రభుత్వం చెల్లించింది. అయితే మొదటి దశలో కట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ఫైనల్ బిల్లులను రాష్ర్ట ప్రభుత్వం ఆపింది. ఒక్కో ఇంటికి రూ. లక్షా 11 వేలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. 

ఇందులో రూరల్‌‌‌‌లో ఇచ్చే రూ. 72 వేలు, ఉపాధి హామీ పనిదినాల పనులు, స్వఛ్చ భారత్ కింద టాయిలెట్స్ నిర్మాణం ఫండ్స్ ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు రాకపోవటంతో సుమారు లక్షా 70 వేల మంది ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న లబ్ధిదారులకు ఫైనల్ బిల్లులు ఆపామని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ ఫైనల్ బిల్లులను లబ్ధిదారులకు రాష్ర్ట ప్రభుత్వం చెల్లిస్తే కేంద్రం రూరల్ సాయాన్ని నేరుగా లబ్ధిదారుని ఖాతాకు బదిలీ చేస్తుంది. అపుడు లబ్ధిదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వసూలు చేయటం అసాధ్యమని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు.