మొన్నటి వరకు వందకు నాలుగైదు కిలోలు దొరికిన ఉల్లిపాయలు.. ఇప్పుడు వందకు రెండు కిలోలు కూడా రావటంలేదు. దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు భారీగా పెరగటంతో సామాన్యులు చుక్కలు చూస్తున్నారు. ముఖ్యంగా మెట్రో సిటీల్లో 50 నుంచి 60 రూపాయలకు పైగా ఉల్లి ధరలు పెరగటం ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్ సిటీలో 2026 ఆగస్టు 24న ఉల్లి కిలో ధర రూ.52 నుంచి రూ.55 వరకు పెరిగింది.
ఉల్లి ధరలు భారీగా పెరగటంతో నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఉల్లి ధరలు మండుతున్న ప్రాంతాల్లో కంద ఎక్స్ ప్రెస్ రైల్లు నడపనున్నట్లు ప్రకటించింది. కంద ఎక్స్ ప్రెస్ ద్వారా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఉల్లి పాయలు సరఫరా చేసి ధరలను కంట్రోల్ చేయనుంది.
ఢిల్లీలో శనివారం (ఆగస్టు 22) ఉల్లి ధర కిలోకు 65 రూపాయలకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో 33 రూపాయలుగా ఉంది. మరోవైపు చెన్నైలో 58 రూపాయలకు కేజీ ఉల్లి చేరుకుంది. గత ఏడాది 33 రూపాయలకు కేజీగా ఉండేది. అదే విధంగా కేరళ, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో కూడా ఉల్లి ధరలు భారీగా పెరిగాయి.
ఉల్లి ధరలు పెరిగిన ప్రాంతాల్లో కంద ఎక్స్ ప్రెస్ నడవనుంది. నాశిక్ నుంచి ఢిల్లీ, చెన్నై, కొచ్చి గువహతీ నగరాలకు ఈ ట్రైన్స్ నడవనున్నాయి. ఉల్లిపాయలతో పాటు షుగర్ ధరలను కూడా కంట్రోల్ చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక షుగర్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. కేజీ చక్కెర 62.5 రూపాయలకు పెరగటంతో జనాలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఢిల్లీ, ముంబై సిటీల్లో 65 నుంచి 70 రూపాయల మధ్య చక్కెర అమ్ముతున్నారు. ధరల నియంత్రణకు కంద ఎక్స్ ప్రెస్ నడపనుంది కేంద్రం. 2024లో ఇదే పరిస్థితి తలెత్తగా అప్పుడు నడిచిన రైళ్లు.. మరోసారి డిమాండ్ ఏరియాల్లోకి సరఫరా చేయనున్నాయి.
