గువాహటి: అస్సాంలో ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా స్వదేశీ లఖిమి జాతికి చెందిన ఆవు దూడ పుట్టింది. ఈ జాతికి సంబంధించి ఇలా ఐవీఎఫ్ ద్వారా దూడ జన్మించడం ఇదే తొలిసారి. అస్సాం వెటర్నరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీలో ఈ దూడ పుట్టిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్‌లో పంచుకున్నారు.
రాష్ట్రంలోని స్వదేశీ పశువుల కోసం అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (సహాయక పునరుత్పత్తి సాంకేతికత) వినియోగంలో ఇదొక కొత్త అధ్యాయమని పేర్కొన్నారు. ఈ విజయాన్ని ‘సభ్యత, సంస్కృతి, సృజన’ల అద్భుతమైన కలయికగా ఆయన అభివర్ణించారు. అలాగే ఈ విజయంలో పాలుపంచుకున్న సైంటిస్టులు, డాక్టర్లను అభినందించారు.
‘‘అస్సాంకు ప్రత్యేకమైన స్వదేశీ లఖిమి జాతికి చెందిన ప్రపంచపు తొలి ఐవీఎఫ్ ఆడ దూడ అస్సాం వెటర్నరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీలో జన్మించింది. స్వదేశీ జాతుల సంరక్షణ, వ్యాధి నియంత్రణను మెరుగుపరచడం నుంచి పాల ఉత్పత్తిని పెంచడం, చివరికి రైతుల ఆదాయాన్ని పెంచడం వరకు ఈ మైలురాయి విజయం మన పశుసంపద, డైరీ రంగానికి కొత్త తలుపులు తెరుస్తుంది. ఇది ఒక చిన్న దూడ కావచ్చు. కానీ రాష్ట్రంలో బయోటెక్నాలజీకి సంబంధించి ఇది ఒక కీలక మైలురాయిని మోసుకొచ్చింది” అని హిమంత పేర్కొన్నారు.
