- సీఎం ఆదేశాలతో వివాదాలు లేని భూములు, స్థలాలు, ఆస్తుల తొలగింపు
- పాత 22ఏ జాబితాతో సరిచూస్తూ మార్పులు
- కొలిక్కి వస్తున్న ప్రక్రియ.. త్వరలోనే ఆన్‌లైన్‌లో రిపోర్టులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న నిషేధిత ఆస్తుల జాబితా(22ఏ) వివాదానికి ఈ వారంలోనే పరిష్కారం లభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, ఈ వారంలోనే సమగ్రంగా సవరించిన నూతన 22ఏ జాబితాను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు 22ఏ నివేదికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎలాంటి వివాదాలు లేని నివాస స్థలాలు,
గత కొద్దికాలంగా రిజిస్ట్రేషన్ల శాఖలో 22ఏ పేరిట చోటుచేసుకున్న తీవ్ర గందరగోళం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు సమగ్ర పరిశీలనను పూర్తి చేశారు. పాత నిషేధిత జాబితా రికార్డులను, హైకోర్టు ఆదేశాలతో ఆరు నెలల కిందట అప్‌డేట్ చేసిన నిషేధిత జాబితాతో సరిపోల్చుతూ వేగంగా మార్పులు చేస్తున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి సర్వే నంబర్ల కారణంగా ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న ప్రైవేటు పట్టా భూములు, నివాస లేఅవుట్లలోని ప్లాట్లు కూడా గుడ్డిగా 22ఏ జాబితాలోకి చేరిపోయిన తప్పిదాలను అధికారులు సరిదిద్దుతున్నారు. ఒక సర్వే నంబర్‌లో కొద్దిపాటి ప్రభుత్వ భూమి ఉంటే, మొత్తం సర్వే నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టేసే పద్ధతికి స్వస్తి పలుకుతూ సబ్ డివిజన్ల వారీగా ఖచ్చితమైన విభజన చేపడుతున్నారు. ఇలా తప్పులన్నీ సరిదిద్ది సవరించిన జాబితాలను త్వరలోనే అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అధికారులకు, ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.
పకడ్బందీగా జాబితా సవరణ..
హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో ఏళ్ల క్రితమే నివాస గృహాలుగా మారిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) స్థలాల సమస్యను అధికారులు పూర్తిగా పరిష్కరిస్తున్నారు. వెబ్ పోర్టల్ డేటాలో పొరపాటున 22ఏ కింద నమోదైన కాలనీల ఇళ్ల నంబర్లను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు మాజీ సైనికోద్యోగులకు, స్వాతంత్ర్య సమరయోధులకు ప్రభుత్వం గతంలో కేటాయించిన భూములపై ఉన్న రిజిస్ట్రేషన్ అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోనున్నాయి.
నిబంధనల ప్రకారం నిర్దేశిత కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా ఈ భూములను అమ్ముకునేందుకు వీల్లేకుండా 22ఏలో కొనసాగించడంతో ఆయా కుటుంబాలు పడుతున్న అవస్థలు తొలగనున్నాయి. పొరపాటున జాబితాలోకి చేరిన సామాన్యుల ఆస్తులకు విముక్తి కల్పిస్తూనే.. వాస్తవమైన ప్రభుత్వ భూములు, అటవీ విస్తీర్ణాలు, చెరువులు, వివిధ న్యాయస్థానాల వివాదాల్లో ఉన్న ఆస్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకుండా 22ఏ నిషేధిత జాబితాలోనే పకడ్బందీగా ఉంచుతున్నారు. కబ్జాదారుల చేతుల్లోకి సర్కారు భూములు వెళ్లకుండా కట్టుదిట్టమైన డిజిటల్ లాకింగ్ వ్యవస్థను కొనసాగిస్తూ, అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించేలా చర్యలు చేపట్టారు.
