అమెరికా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో చదువు.. కోట్లలో జాబ్ ప్యాకేజీలు.. గ్లోబల్ మేనేజ్‌మెంట్ కోర్సులు అంటే చాలామంది యువత పడే ఆరాటం అంతా ఇంతా కాదు. అయితే కేవలం కలల ప్రపంచాన్ని చూపిస్తూ భారీ ఫీజులు వసూలు చేసే కొన్ని విద్యా సంస్థల తీరు నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. తాజాగా రూ.50 లక్షల ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని, గ్లోబల్ ఎంబీఏ పూర్తి చేసిన ఓ యువకుడు ఉద్యోగం రాక రెడిట్ వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కడం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది.
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆ యువకుడు.. తన తండ్రి ఒక్కరే సంపాదిస్తున్నప్పటికీ కుటుంబ భవిష్యత్తు కోసం ఈ సాహసం చేశాడు. ఎస్పీ జైన్ గ్లోబల్ సంస్థలో మాస్టర్ ఆఫ్ గ్లోబల్ బిజినెస్ కోర్సులో చేరేందుకు సుమారు 9 శాతం వడ్డీతో ఏకంగా రూ.50 లక్షల ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాడట. దుబాయ్, సింగపూర్, లండన్ వంటి నగరాల్లో చదువుకునే అవకాశం ఉంటుందని, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎస్పీ జైన్ యాజమాన్యం ఆశ చూపడంతో సెటిల్ అయితే ఫ్యామిలీ రూపురేఖలు మారిపోతాయని భావించాడు.
అయితే.. కోర్సు పూర్తయిన తర్వాత రియాలిటీ పూర్తిగా భిన్నంగా ఉంది. లోన్ తీసుకుని కోర్స్ చేస్తే అతని జీవితం తలకిందులైంది. అడ్మిషన్ల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని సదరు యువకుడు వాపోయాడు. సుమారు 85 మంది విద్యార్థులు ఉన్న తమ బ్యాచ్‌లో కేవలం 6 నుంచి 7 మంది మాత్రమే క్యాంపస్ ప్లేస్‌మెంట్లు వచ్చాయట. కేవలం 3 నుంచి 4 నెలల స్వల్పకాలిక విదేశీ స్టూడెంట్ పాస్‌లపై చదవడం వల్ల అక్కడే స్థానికంగా ఉద్యోగాలు సంపాదించడానికి ఎలాంటి చట్టపరమైన మార్గాలు, వీసా స్పాన్సర్‌షిప్‌లు లభించలేదని చెప్పాడు.
ప్రస్తుతం నెలవారీ ఎడ్యుకేషన్ లోన్ EMI రూ.65వేలు చెల్లించాల్సిన భారం పడింది. లోన్ రీపేమెంట్ మోరటోరియం పొడిగింపు కోసం లెండింగ్ బ్యాంకును ఆశ్రయించినప్పటికీ నిరాశే ఎదురైందట. లింక్డ్‌ఇన్, నౌకరీ ద్వారా చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతుండగా.. బయట వస్తున్న ఆఫర్లు కేవలం రూ. 4-5 లక్షల వార్షిక ప్యాకేజీలకే పరిమితమయ్యాయని చెప్పాడు. ఈ తక్కువ ఆదాయంతో జీవనం సాగించడం, భారీ ఈఎంఐలు కట్టడం తన కుటుంబానికి అసాధ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ పోస్ట్‌పై స్పందించిన రెడిట్ యూజర్లు అతనికి పలు రకాల సలహాలు ఇస్తున్నారు. ముందుగా ఏదో ఒక ఎంట్రీ-లెవల్ ఉద్యోగంలో చేరి ఆదాయ వనరును సృష్టించుకోవాలని, ఆ తర్వాత రాత్రిళ్లు కష్టపడి అప్ స్కిల్లింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. గ్లోబల్ ఎంబీఏ బ్రాండింగ్ మోజు నుంచి బయటపడి, ప్రస్తుత మార్కెట్‌కు తగినట్లుగా నైపుణ్యాలను మార్చుకోవాలని కొందరు సలహా ఇస్తుండగా.. మరికొందరు లోన్ రీస్ట్రక్చరింగ్ ఆప్షన్లను పరిశీలించాలని సూచిస్తున్నారు. మెుత్తానికి కాలేజీలు చెప్పే కల్లబొల్లి మాటలు, హై ప్యాకేజీ జాబ్ ఆఫర్ మాటలు, ఫారెన్ టూర్స్ స్టోరీలు విని లక్షలు పెట్టి ఎంబీఏలు చేసిన చాలా మంది విద్యార్థులకు ఈ మధ్యతరగతి గ్రాడ్యుయేట్ స్టోరీ కనువిప్పుగా నిలుస్తోంది.
