అమెరికాలో హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్యలో అనూహ్యమైన తగ్గుదల కనిపిస్తోంది. కఠినంగా మారుతున్న ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా రూల్స్ ప్రభావం అమెరికాలోని యూనివర్సిటీలపై పడుతోంది. అమెరికాలో ఉన్న 1,100లకు పైగా విద్యా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ప్రముఖ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025-26 విద్యా సంవత్సరంలో యూఎస్ కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య సుమారు 15 శాతం క్షీణించినట్లు స్పష్టమైంది.
అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు భారత్ అతిపెద్ద భాగాన్ని కలిగి ఉంది. 2024-25 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల కోసం సుమారు 3.63 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో ప్రవేశాలు పొందారు. అయితే తాజా పరిస్థితుల కారణంగా కామన్ యాప్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాబోయే 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం మొత్తం మీద దరఖాస్తులు పెరిగినప్పటికీ.. మార్చి 1 నాటికి అంతర్జాతీయ దరఖాస్తుదారులు మాత్రం 10 శాతం పడిపోయారు. ఇది రికార్డు స్థాయిలో నమోదైన అత్యంత భారీ క్షీణతగా నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న కఠినమైన విధాన నిర్ణయాలే. నాఫ్సా, జెబి ఇంటర్నేషనల్ పరిశోధనా సంస్థ సంయుక్తంగా వెల్లడించిన నివేదిక ప్రకారం.. కఠినమైన వీసా రూల్స్, అనిశ్చిత విధానాల వల్ల ఫాల్ 2026 నాటికి అంతర్జాతీయ విద్యార్థుల రిజిస్ట్రేషన్లు లక్షా 10 వేల వరకు తగ్గే అవకాశం ఉంది. గతంలో ఫాల్ 2025-26లో 11లక్షల 69వేలుగా ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల నమోదు.. ఈ ఏడాది భారీగా పడిపోయి 10లక్షల 57వేలకు పరిమితమైంది.
►ALSO READ | క్రిప్టో ఇన్వెస్టర్లపై కనకవర్షం: బ్రేక్ లేకుండా దూసుకుపోతున్న బిట్‌కాయిన్.. ఎందుకంటే?
ఈ విధానాల ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగా పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా గత విద్యా సంవత్సరంలో స్థానిక ఆర్థిక వ్యవస్థకు సుమారు 42 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. అయితే ఈ సంఖ్య రాబోయే కాలంలో 38 బిలియన్ డాలర్లకు పడిపోతుందని అంచనా. ముఖ్యంగా జూలై నెలలో యూఎస్ ప్రభుత్వం స్టూడెంట్ అండ్ విజిటర్ వీసాలకు సంబంధించి సాంప్రదాయ "డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్" నిబంధనలను ఎత్తివేసింది. విద్యార్థుల బస కాలాన్ని సాధారణంగా 4 ఏళ్లకు పరిమితం చేస్తూ కొత్త రూల్స్ తెచ్చింది.
అంతేకాకుండా గ్రాడ్యుయేషన్ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకోవాలనుకునే విదేశీ విద్యార్థులపై లక్ష డాలర్ల భారీ రుసుమును విధించే అంశాన్ని కూడా అమెరికా పరిశీలిస్తోంది. ఇటువంటి కఠిన రూల్స్ భారతీయ విద్యార్థులు అమెరికా వైపు అడుగులు వేయడానికి వెనుకంజ వేసేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ విధానాలు అంతర్జాతీయ విద్యా రంగాన్ని, ముఖ్యంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
