ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కేంద్రం వార్నింగ్.. E20 పెట్రోల్‌పై కీలక నిర్ణయం!

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కేంద్రం వార్నింగ్.. E20 పెట్రోల్‌పై కీలక నిర్ణయం!

దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ E20 నాణ్యతను మరింత కఠినతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఆటోమొబైల్స్ రంగం నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనలతో 100 శాతం పారదర్శకతను తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం E20 పెట్రోల్‌లో క్లోరైడ్ కంటామినేషన్ పరిమితిని 3 పీపీఎం లోపు ఉండేలా చూడటాన్ని స్వచ్ఛంద నాణ్యతా ప్రమాణాల కింద అమలు చేస్తున్నారు. అయితే ఈ నిబంధనను ఇకపై చట్టబద్ధం చేసి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇంధన నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) ఇథనాల్ లో కాలుష్య సంబంధిత నిబంధనను తప్పనిసరి చేసే కసరత్తును ముమ్మరం చేసింది. తాము కంటామినెంట్స్ పరిమితులను తప్పనిసరి చేయాలనుకుంటున్నామని ఒక ప్రభుత్వ అధికారి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా ఇంధన నాణ్యతను మెరుగ్గా నిర్వహించవచ్చని ఆయన అన్నారు. పెట్రోల్ బంకుల్లో లభిస్తున్న E20 ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్‌లో క్లోరైడ్ స్థాయిలు, తేమ మోతాదు ఎక్కువగా ఉంటున్నాయని ఆటోమొబైల్ తయారీ కంపెనీలు ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.

ఈ నాణ్యతా లోపాల వల్లే వాహనంలోని కీలక విడిభాగాలు త్వరగా దెబ్బతింటున్నాయని ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో అసలు ప్లాన్ కంటే 5ఏళ్ల ముందే 20 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం అనే లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా సాధించింది. అయితే భవిష్యత్తులో ఇథనాల్ మిక్సింగ్ పెట్రోల్ లో మరింత పెంచే విషయమై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ నాణ్యతా సమస్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నేరుగా వాహనాల ట్యాంకుల నుంచి సేకరించిన కొన్ని పెట్రోల్ శాంపిల్స్‌లో అత్యధిక క్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇప్పుడు దీనిని సరిదిద్దేందుకే కఠినమైన క్వాలిటీ రూల్స్ తీసుకురావాలని చూస్తోంది మోడీ సర్కార్. 

►ALSO READ | LIC పాలసీదారులకు బిగ్ షాక్.. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ బంద్!

ఈ పరిణామాలు ఆటోమోటివ్ ఇంధన సరఫరా వ్యవస్థలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై మరింత బాధ్యతను పెంచుతున్నాయి. వాహనాల భద్రతను, ఇంజిన్ భాగాల పనితీరును కాపాడేందుకు నాణ్యతా ప్రమాణాల విషయంలో కఠిన నిబంధనలు అనివార్యమని దేశీయ ఆటో ఇండస్ట్రీ భావిస్తోంది. ఈ కొత్త మార్పులు అమల్లోకి వస్తే.. భవిష్యత్తులో గ్రీన్ ఫ్యూయల్ వాడకం మరింత సురక్షితంగా మారుతుందని అంచనా.