Movie Review: తెలంగాణ వీరుడి వీరోచిత గాథ.. ‘సర్దార్ సర్వాయి పాపన్న’ మూవీ రివ్యూ

Movie Review: తెలంగాణ వీరుడి వీరోచిత గాథ.. ‘సర్దార్ సర్వాయి పాపన్న’ మూవీ రివ్యూ

‘మా భూమి మాది.. మా పాలన మాది’ అంటూ నిజాం, మొఘల్ చక్రవర్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీశాలి, తెలంగాణ ప్రాంత అస్తిత్వ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న (Sardaar Sarvai Papanna). ఇప్పుడు ఈ లెజండరీ ఫైటర్ జీవిత చరిత్ర సరికొత్త రూపంలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్‌లో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు యానిమేషన్ టెక్నాలజీని మేళవిస్తూ దర్శకుడు వెంకటేష్ గౌడ్ లింగంపల్లి తెరకెక్కించారు. మరి ఈ చారిత్రక చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం..

కథేంటంటే:

17వ శతాబ్దం. గోల్కొండ నవాబులు మరియు మొఘల్ సామ్రాజ్యం సామాన్య ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపుతూ, దోపిడీకి పాల్పడుతున్న చీకటి కాలం అది. సరిగ్గా అదే సమయంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పాపన్న.. పాలకుల అరాచకాలను చూసి రగిలిపోతాడు.

‘‘ఒకడు పాలిస్తే వంద మంది దోచుకుంటున్నారు.. ఈ బానిస బ్రతుకులు మారాలి’’ అనుకుంటాడు. కేవలం మాటలతో కాకుండా చేతల్లో చూపించాలని నిర్ణయించుకుంటాడు. కులమతాలకతీతంగా అణగారిన వర్గాలను ఏకం చేసి, ఒక శక్తివంతమైన గెరిల్లా సైన్యాన్ని తయారు చేస్తాడు. మొఘలుల కోటలను బద్దలు కొడుతూ, ప్రజల కోసం స్వయంపాలన సాగించిన పాపన్న ప్రయాణం చివరికి ఏమైంది? ఆయన ఎదుర్కొన్న కుట్రలు ఏమిటి? అనేదే ఈ సినిమా యొక్క మిగతా స్టోరీ.

విశ్లేషణ:

ఏఐ (AI) విజువల్ వండర్: ఈ సినిమాకు అతిపెద్ద ఎసెట్ టెక్నాలజీ. భారీ బడ్జెట్ సెట్లు లేకుండా 17వ శతాబ్దపు కోటలు, నాటి యుద్ధ వాతావరణం, గ్రామీణ నేపథ్యాన్ని కేవలం ఏఐ మరియు యానిమేషన్ ద్వారా సృష్టించిన విధానం ఒక సరికొత్త దృశ్య అనుభూతిని ఇస్తుంది.

పాపన్న పాత్ర ఎలివేషన్స్: పాపన్న కేవలం కత్తి పట్టుకుని పోరాడటమే కాదు.. ఆయన ఆలోచనలు, ప్రజల పట్ల చూపిన ప్రేమ, నాయకత్వ లక్షణాలు చూస్తే గూస్‌బంప్స్ వస్తాయి. ముఖ్యంగా తల్లి సవరమ్మతో అతనికి ఉన్న అనుబంధం, ప్రజల పట్ల అతని బాధ్యత, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం వంటి అంశాలు కథకు ఎమోషనల్ ఫీల్ తీసుకొచ్చాయి. 

►ALSO READ | OTT Thriller: రూ.17 కోట్ల బ్యాంక్ దోపిడీ.. అసలు దొంగ ఎవరు? అదిరిపోయే ట్విస్టులతో ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్

జానపద సంగీతం: తెలంగాణ మట్టి వాసనలను అద్దే పాటలు, ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల వద్ద వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఎల్లమ్మ పాట ప్రాంతీయ నేటివిటీని తెరపై మరింత బలంగా ప్రతిబింబిస్తుంది. యుద్ధ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం వీరరసాన్ని పెంచేలా సాగింది. సంగీత దర్శకులు రాజ్ కిరణ్, రఘు చారుకేశి సినిమా,ఆకూ న్యాయం చేశారు.

ఫైనల్గా.. ‘సర్దార్ సర్వాయి పాపన్న–ది రెబల్ కింగ్ ఆఫ్ డెక్కన్’ కేవలం ఒక సినిమా కాదు.. మన చరిత్ర పుటల్లో మరుగున పడిన ఒక నిజమైన వీరుడికి ఇచ్చిన దృశ్య నివాళి. ఒక చారిత్రక కథను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం మాత్రమే కాకుండా, తెలంగాణ చరిత్రలో తనదైన ముద్ర వేసిన ఒక వీరుడి పోరాటాన్ని నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నంగా నిలుస్తుంది. కథాంశం, ప్రాంతీయ నేటివిటీ, వీరోచిత సన్నివేశాలతో పాటు AI, యానిమేషన్ వంటి టెక్నాలజీని ఉపయోగించిన విధానం ఈ చిత్రానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.