ముంబై: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రచారం వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో మాదిరిగా ఇకపై అంతగా పనిచేయలేనని.. బాధ్యతలను కొత్త తరానికి అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం (ఆగస్ట్ 25) నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా నిరంతరం ప్రజా జీవితంలో పనిచేస్తున్నాను.
ఎన్నో ఒడిదుడుకులను చూశాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను. కానీ గతంలో మాదిరిగా ఇప్పుడు నేను ఎక్కువగా పనిచేయలేకపోతున్నా. కొత్త తరానికి పనిచేసే అవకాశం ఇవ్వాలని అన్నారు. యంగ్ జనరేషన్‌కు పాతతరం మార్గనిర్దేశం చేస్తోందన్నారు. భవిష్యత్‌లో మహారాష్ట్రలోని ఏ గిరిజన గ్రామం కూడా విద్యుత్ లేకుండా ఉండకూడదని.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కనబడాలని ఆకాంక్షించారు.
కాగా, ఇటీవలే బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటైన విషయం తెలిసిందే. 65 మంది సభ్యులతో నితిన్ నబిన్ నేతృత్వంలో కొత్త జాతీయ బృందాన్ని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. 65 మందిలో 51 మంది కొత్తవారే ఉండటం గమనార్హం. దీంతో పాతతరాన్ని పక్కకు పెట్టి యంగ్ జనరేషన్‌కు బీజేపీ పెద్దపీట వేస్తోందనే విషయం స్పష్టమైంది. ఈక్రమంలోనే మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలిని కూడా త్వరలో విస్తరించనున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో బాధ్యతలను కొత్త తరానికి అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందంటూ కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర చర్చకు దారి తీశాయి. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో పలువురు సీనియర్లను పక్కన పెట్టి యంగ్ జనరేషన్‌కు అవకాశం ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారానికి గడ్కరీ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
