న్యూఢిల్లీ: విద్యార్థులు, యువత సమస్యలపై గళం విప్పుతోన్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను వెలికితీసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్కూల్ ఠీక్ కరో కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా సీజేపీ కార్యకర్తలు దేశంలోని పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకు బహిరంగా లేఖలు రాశారు. ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల ఖాళీలు, నిధుల కేటాయింపు సమాచారం ఇవ్వాలని కోరారు.
విద్యను ఒక దీర్ఘకాలిక పరిపాలనా అంశంగా కాకుండా అత్యంత అత్యవసర ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీరు, తరగతి గదులు, కూర్చోవడానికి బెంచీల కొరత ఎంతవరకు ఉంది..? ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ని టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి..? ప్రభుత్వ విద్య కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు.. అందులో ఎంత ఖర్చు చేశారు..? డిజిటల్ లేదా కంప్యూటర్ లెర్నింగ్ సౌకర్యాలు ఉన్నాయా..? వీటికి సంబంధించిన వివరాలు అందజేయాలని అన్ని రాష్ట్రాలను కోరారు.
దేశంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలలో దుస్థితి భయంకరంగా ఉందని.. అలాంటి పరిస్థితుల్లో వారు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. కొన్ని చోట్ల పిల్లలను జంతువుల కంటే హీనంగా చూస్తూ పశువుల కొట్టాల్లో ప్రభుత్వ పాఠశాలలు నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనభై ఏండ్లయినా పిల్లలకు కనీస వసతులైన తాగునీరు, సురక్షితమైన క్లాస్‌రూమ్‌లు కల్పించకపోవడంపై ప్రభుత్వాల జవాబుదారీతనాన్ని ప్రశ్నించారు. విద్యార్థులు చదువుకునేందుకు కనీస వసతులు లేనప్పుడు దేశం ఎలా పురోగమిస్తుందని ప్రభుత్వాలను నిలదీశారు. దేశ భవిష్యత్ పౌరులైన పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల వసతులను యుద్ధ ప్రాతిపదికన బాగుచేయాలని డిమాండ్ చేశారు.
