రాఖీ పండుగకు ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా.. బంధం నిలిపేదే రాఖీ బంధన్..!

 రాఖీ పండుగకు ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా.. బంధం నిలిపేదే రాఖీ బంధన్..!

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి  లేదా రక్షా బంధన్ పేర్లతో పిలుస్తారు. రాఖీ లేదా రక్షా పండుగను మన దేశంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశానికే పరిమితమైన ఈ సంప్రదాయం తర్వాత దేశమంతటా వ్యాపించింది. ఆ రోజు( ఆగస్లు 28)  అన్న లేదా తమ్ముడు.... అన్నదమ్ముల వరసయ్యే వాళ్లందరికీ అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. . .

రాఖీ పౌర్ణమికి ఎన్ని పేర్లో..

శ్రావణ పౌర్ణమికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన పేర్లు ఉన్నాయి. మన దగ్గర రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలోనూ రక్షాబంధన్ గా పిలిచే ఈ పండుగను సావనీ సలోవా అని కూడా అంటారు. దక్షిణాదిలో నారికేళ పౌర్ణమి, అవనీ అవిత్తమ అనే పేర్లతో.... గుజరాత్​లో పవిత్రోపనా  అనే పేరుతో పిలుస్తారు. మహారాష్ట్రలో దీన్ని సరాళి పూర్ణిమగా జరుపుకుంటారు. మహారాష్ట్ర కోస్తా తీరంలో కొలిస్ అనే మత్స్యకారులు వరుణదేవుని ఆరాధ్యదైవంగా కొలుస్తారు. రాఖీ పండుగ సందర్భంగా వీళ్లు కొబ్బరికాయల్ని సముద్రంలోకి విసిరి వరుణదేవుని పూజిస్తారు. సంపదలకు ప్రతీక అయిన సింధూరాన్ని ఒకరి నుదుటి పై మరొకరు వద్దుతారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో ఘూలాద్ పూర్ణిమ పేరుతో రాధాకృష్ణులను పూజించిన తర్వాత మహిళలు తమ సోదరులకు రాఖీలు కడతారు.

బంధం నిలిపే  రాఖీ బంధన్

రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్ష అంటే రక్షించడం. బంధన్ అంటే కట్టడం. ఒక ఇంటి ఆడపడుచు తన అన్న లేదా తమ్ముడు వేసే ప్రతి అడుగూ విజయం వైపే సాగాలని, తన సోదరుడు అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ.. నుదుట కుంకుమ పెట్టి, సన్నటి దారం, ఒక తోరణంతో తయారు చేసిన రాఖీని వాళ్ల చేతికి కడుతుంది. తర్వాత నోటిని తీపి చేసి హారతి పడుతుంది. అప్పుడు. సోదరుడు తన సోదరికి ఏకష్టమొచ్చినా. కాపాడతానని వాగ్దానం చేస్తారు. ఆపైన తనకు తోచిన కానుకలను అందిస్తాడు. ఈ పండుగకు కులమతాల పట్టింపు లేదు. పేదాగొప్పా తేడా అసలే ఉండదు.

అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ.