అనగనగా ఒక అడవి. ఆ అడవిలోకి ఓ కుందేలు కొత్తగా అడుగుపెట్టింది. ఆ అడవి అందానికి అక్కడి సౌకర్యాలకు ముచ్చట పడింది. ఆ అడవిలోనే ఉందామని అనుకుంది. కానీ అది ఇతర జంతువులతో స్నేహంగా ఉండటం లేదు. అవి మాట్లాడాలని ప్రయత్నించినా కుందేలు మౌనంగా ఉంటోంది. ప్రతీ జంతువును అనుమానంగా చూస్తోంది.
ఒకరోజు ఆహారం కోసం అలా వెళ్తుండగా ఓ చోట పెద్దపులి కనిపించింది. భయంతో కుందేలు వెనక్కి తిరిగి పరుగో పరుగు. కుందేలు వెంట పెద్దపులి పడింది. ఇలా తరచూ పులిని చూసి కుందేలు భయంతో పరుగులు తీయడం, కుందేలు వెంట పెద్దపులి పడటం జరిగేది. కుందేలు అతి జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టింది. రోజులు గడిచాయి. కుందేలుకు బుల్లి కుందేలు పుట్టింది. దాన్ని అల్లారుముద్దుగా పెంచుతోంది. ఆ చిన్ని కుందేలు అడవిలో తిరగడం మొదలు పెట్టింది. తల్లి కుందేలు.. తన బిడ్డకు పెద్దపులి గురించి చెప్పి, అడవిలో ఎక్కువ తిరగొద్దని హెచ్చరించింది. ఇలా రోజూ చెప్పేసరికి ఆ పులిని చూడాలని చిన్ని కుందేలుకు కుతూహలం కలిగింది.
ఓరోజు చిన్ని కుందేలు పెద్దపులి కంట పడనే పడింది. పెద్దపులి చిన్ని కుందేలును పిలిచింది. ఆప్యాయంగా మాట్లాడింది. తన వీపున కూర్చోబెట్టుకొని తిప్పసాగింది. బిడ్డ కనబడక కంగారుగా వెతుకుతున్న తల్లికి... పెద్దపులి వీపుపై తన బిడ్డ కనిపించింది.
పెద్దపులి ముందుకు వెళ్ళి తన బిడ్డను వదలి పెట్టమని, కావాలంటే తనను తినమని వేడుకుంది.
అటుగా వచ్చిన ఓ ఎలుగుబంటి కుందేలుతో ఇలా అంది... “ఓ కుందేలమ్మా! ఆ పులి గురించి ఏమనుకున్నావు ? తనకు జన్మనిచ్చిన ఈ అడవిపై దానికి మమకారం ఎక్కువ. ఈ అడవిలోని ప్రతి జీవిని తన సోదరుల్లా భావించి వాటితో స్నేహపూర్వకంగా మెలుగుతుంది. వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ వాటికి సేవలు చేస్తుంది. నీతో స్నేహం చేద్దామని దగ్గరకు వస్తున్న ప్రతిసారీ ఆ పులిని నీవు అపార్థం చేసుకున్నావు. ఈ అడవి జీవులన్నీ మంచివే. వాటితో స్నేహం చేస్తేనేగా, ఈ సంగతులన్నీ తెలిసేవి.
మాపై అనుమానం పెంచుకొని, ఒంటరిగా బతుకుతున్నావు. అందరితో స్నేహంగా ఉంటే ఎన్ని ఆపదల నుంచి అయినా తప్పించుకోవచ్చు. ఒకరికి ఒకరు సాయం చేసుకోవచ్చు. ఇకనైనా మాతో కలువు.” పెద్దపులిని, అడవి జంతువులను క్షమించమని వేడుకుంది కుందేలు. స్నేహం విలువ తెలుసుకొని అందరితో కలిసిపోయింది.
-సరికొంద శ్రీనివాసరాజు
