హాస్పిటల్లో మ్యూజికల్ నైట్.. కొంబుచా డ్రింక్.. సోషల్ మీడియాలో తీవ్ర వివాదం

హాస్పిటల్లో మ్యూజికల్ నైట్.. కొంబుచా డ్రింక్.. సోషల్ మీడియాలో తీవ్ర వివాదం

హాస్పిటల్ అంటే ఎలా ఉంటుంది..  రోగులు, వారి కోసం వచ్చిన అటెండర్లు.. డాక్టర్లు, నర్సులు.. ఎప్పుడూ ఒక సీరియస్ వాతావరణం ఉంటుంది కదా. ఉంటే సైలెంట్ గానో.. లేకుంటే ఆర్థనాదాలతోనో మారుమోగే హాస్పిటల్ లో మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది.  హాస్పిటల్ ఏంటి మ్యూజికల్ నైటేంటి..? అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంది కదా. బెంగళూరులో ఓ హాస్పిటల్ నిర్వహించిన వీకెండ్ మ్యూజికల్ నైట్ తీవ్ర వివాదాస్పదం అవుతోంది.

బెంగళూరుకు చెందిన హెల్త్ కేర్ స్టార్టప్ సూపర్ హెల్త్ హాస్పిటల్ (Superhealth Hospital) నిర్వహించిన మ్యూజిక్ నైట్ (లైవ్ మ్యూజిక్ ఈవెంట్) సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి, చర్చకు దారితీసింది. ఈవెంట్ మేనేజింగ్  కంపెనీ అయిన లోకల్ హాస్ట్ (Localhost HQ)తో కలిసి 2026 ఆగస్టు 22వ తేదీన HOSPITA/ITY vol.001  పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఒకవైపు రోగులు నారాయణ, పరమాత్మ కాపాడు తండ్రీ అని ప్రాణాలు చేతిలో పెట్టుకుని అవస్థలు పడుతుంటే.. మ్యూజికల్ నైట్ పేరుతో ఎంజాయ్ చేయడమేంటని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హాస్పిటల్ లో పరోక్షంగా పబ్ నిర్వహిస్తున్నారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. 

ఆ సంప్రదాయాన్ని మార్చేందుకే..

ఒకవైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా..హాస్పిటల్ యాజమాన్యం ఈవెంట్ నిర్వహించడాన్ని సమర్ధించుకుంటోంది. హాస్పిటల్స్ అంటేనే ఒకరకమైన సీరియస్ వాతావరణం, నిశ్చద్వంతో భయాందోళనకు గురయ్యేలా ఉంటుందని.. ఆ సంప్రదాయాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. పేషెంట్స్ తో వచ్చే అటెండర్స్ దిగులు మరిచి కాస్త ఉపశమనం పొందేలా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. 

అయినా.. పేషెంట్స్ కు ఎలాంటి సంబంధం లేకుండా.. వారికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిర్వహించినట్లు చెప్పారు.  ఔట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) గడువు ముగిసిన తర్వాత, హాస్పిటల్‌లోని నాన్-క్లినికల్  అంతస్తులలో ఈ లైవ్ మ్యూజిక్ ఈవెంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  హాస్పిటల్స్ అంటే  భయంకరమైన, చల్లని వాతావరణం ఉండే ప్రదేశాలు కాదని, వాటిని మరింత సానుకూలంగా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వ్యవస్థాపకులు తెలిపారు. 

కొంబుచా డ్రింక్:

మ్యూజికల్ నైట్ కు అటెండ్ అయిన వారికి  యాజమాన్యం కొంబుచ డ్రింక్ అరేంజ్ చేసింది. కొంబుచ అంటే  టీ, చక్కెర, బ్యాక్టీరియా , ఈస్ట్ కలగలిపి పులియబెట్టడం   ద్వారా తయారు చేసే ఒక రకమైన పుల్లటి, తియ్యని కార్బోనేటెడ్ హెల్దీ డ్రింక్. 

మ్యూజికల్ నైట్ లో ఆల్కహాల్, స్మోకింగ్ వంటి వాటికి అనుమతి లేదని, కేవలం ఆరోగ్యకరమైన కొంబుచ డ్రింక్ అందించామని నిర్వఆహకులు తెలిపారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సౌండ్ వ్యవస్థను నియంత్రించామని స్పష్టం చేశారు.

భిన్న వాదనలు:

మ్యూజికల్ నైట్ పై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఈవెంట్ నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒకవైపు రోగులు ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే.. మ్యూజికల్ నైట్ ఎట్ల నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. రోగుల కోసం వచ్చిన అటెండర్స్ తీవ్ర ఆవేదలో ఉంటారని.. అలాంటి మ్యూజికల్ నైట్ లో వచ్చి డ్యాన్సులు చేస్తారా ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు. హాస్పిటళ్లను ఎంటర్టైన్ మెంట్ హబ్ లుగా మార్చవద్దని హెచ్చరిస్తున్నారు. ఇది బాద్యతారహిత్యమైనదేనని అంటున్నారు. 

మరి కొందరు.. హాస్పిటల్స్ లో ఉండే నిర్వేదాన్ని తగ్గించి రోగులు, వారి అటెండర్స్ లో కాస్త ఉపశమనం కల్పించడం మంచిదే కదా అని ప్రశ్నిస్తున్నారు. రోగులకు ఇబ్బంది కలగకుండా చేసుఉంటే తప్పేంటని అంటున్నారు. 

జనాల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలతో మ్యూజికల్ నైట్ ను తొలగించారు. కానీ ఇదైతే పెద్ద డిబేటే క్రియేట్ చేసింది. ఈ అంశంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 
 ఆసుపత్రిలో ఇలాంటి పార్టీలు లేదా సంగీత కార్యక్రమాలు నిర్వహించడం రోగుల పట్ల అనారోగ్యకరమైన, బాధ్యతారహితమైన చర్యగా నెటిజన్లు, విమర్శకులు మండిపడ్డారు. ఐసీయూలు, అనారోగ్యంతో బాధపడేవారు ఉండే చోట ఇలాంటివి సరికాదని అభిప్రాయపడ్డారు.ఈ వివాదంపై మీరేమి అనుకుంటున్నారు? ఆసుపత్రులలో ఇలాంటి ఈవెంట్లు నిర్వహించడం సరైనదేనా లేక తప్పంటారా?