హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్య నగర్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూలిన భవనం పక్కనే ఉన్న భవనాన్ని హైడ్రా అధికారులు పూర్తిగా తొలగించారు. మరో భవనాన్ని కూల్చడానికి రంగం సిద్ధం చేశారు. బాహుబలి క్రేన్తో కూల్చిస్తున్నారు.
మూడు రోజుల కింద అంజయ్యనగర్లో 50 గజాల్లో నాలాపై కట్టిన ఏడంతస్థుల మేడ కుప్పకూలడంతో అధికారులు మళ్లీ అప్రమత్తం కావడం గమనార్హం. ఈ బిల్డింగ్పక్కనే ఉన్న మరో మూడు బిల్డింగులు దెబ్బతినడంతో ఆది, సోమవారాల్లో కూల్చివేత పనులు మొదలుపెట్టారు.
గచ్చిబౌలి అంజయ్యనగర్లో కుప్పకూలిన భవనం పక్కనే ఉన్న మరో బిల్డింగ్కూల్చివేత పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం మొదలైన పనులు అర్ధరాత్రి వరకూ నడవగా, డిస్ట్రబెన్స్గా ఉందని స్థానికులు చెప్పడంతో ఆపేశారు. మళ్లీ సోమవారం ఉదయం మొదలుపెట్టారు. బిల్డింగ్చుట్టూ అపార్ట్మెంట్లు, ఇతర బిల్డింగులు ఉండడంతో శిథిలాలు వాటి మీద పడకుండా హైడ్రా జాగ్రత్తగా కూలుస్తోంది. ఇప్పుడు మళ్లీ మరో బిల్డింగ్ కూల్చివేత కొనసాగుతుంది.
కూల్చివేత పనులను సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కూలిన బిల్డింగు పక్కన పక్కనే మరికొన్ని భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు వారి దృష్టికి తీసుకువెళ్లడంతో పరిశీలించి, అవసరమైతే తొలగిస్తామని ప్రకటించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. కొంతమేర వరద కాలువను ఆక్రమించి 50 గజాల స్థలాల్లో ఏడెనిమిది అంతస్తులు కట్టడం వల్ల పటిష్టత దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. రెండతస్తులకే పర్మిషన్లు తీసుకుని ఆ మేరకే పిల్లర్లు, పునాదులు వేసి ఆపై ఏడంతస్తుల వరకు కట్టడంతో భవనాల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు.
