స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు రూపంలో షాక్ తగిలిన క్రమంలో పంచాయితీ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టింది ఏపీ సర్కార్. పంచాయితీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై జీవో 153 జారీ చేసింది ప్రభుత్వం. ఈమేరకు బీసీలకు 34శాతం రిజర్వేషన్లపై గతంలో జారీ చేసిన జీవో 105లో సవరణలు చేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డేడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం.
ఈ క్రమంలో గ్రామీణ స్థానిక సంస్థలవారీగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు చట్ట నిబంధనల ప్రకారమే నిర్ణయించాలని పేర్కొంది. సీట్లు, పదవుల కేటాయింపు, రిజర్వేషన్ల రొటేషన్ పై ప్రత్యేక నిబంధనలు రూపొందించనుంది ప్రభుత్వం.
ఈ క్రమంలో జీవో 153 అమలుపై చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం
