తెలంగాణ శక్తిపీఠం: అలంపూర్‌ జోగులాంబ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి శోభ

తెలంగాణ శక్తిపీఠం: అలంపూర్‌ జోగులాంబ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి శోభ

నవరాత్రుల వేళ అమ్మవారి నామస్మరణతో మార్మోగుతోంది అలంపూర్‌‌‌‌! అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో వెలసిన ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ, దక్షిణ కైలాసంగా పిలుస్తారు. 

ఉగ్రరూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని కొలిచేందుకు నవరాత్రుల వేళ వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. అక్టోబర్‌‌‌‌ 11 నుంచి 20 వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలతో అలంపూర్‌‌‌‌ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

నవరాత్రుల్లో అమ్మవారిని చండీ నవదుర్గా స్వరూపంలో పూజిస్తారు. మొదటి మూడు రోజులు మహాకాళిగా, తర్వాత మూడు రోజులు మహాలక్ష్మిగా, చివరి మూడు రోజులు మహాసరస్వతిగా దర్శనమిస్తారు. తొమ్మిదో రోజు తుంగభద్ర నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. 

ధ్వజారోహణం, కల్యాణోత్సవం, రథోత్సవం, కాళరాత్రి పూజ, శమీ పూజ, నదీ హారతితోపాటు లలిత సహస్రనామార్చన, ఖడ్గమాలా అర్చన, స్త్రీశక్తి అర్చనలు నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

అమ్మవారి విశిష్ట రూపం

అమ్మవారు శవంపై కూర్చుని, తలపై తేలు, కప్ప, బల్లితో నాలుక బయటకు చాచిన ఉగ్రరూపంలో దర్శనమిస్తారు. ఆ ఉగ్రరూపంలోని వేడిని తగ్గించేందుకు ఆలయం చుట్టూ నీటి కొలను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో బాలబ్రహ్మేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఏడో, ఎనిమిదో శతాబ్దాల్లో బాదామి చాళుక్యులు నిర్మించిన స్వర్గ, పద్మ, తారక, బాల, అర్క, కుమార, గరుడ, వీర, విశ్వబ్రహ్మ ఆలయాలు చాళుక్య శిల్పకళకు నిదర్శనాలు. 2005 ఫిబ్రవరిలో నూతన ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు.

రూ.351 కోట్లతో అభివృద్ధి

ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లతో సమగ్ర ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదానికి పంపినట్లు ఈఓ ఎ. దీప్తిరెడ్డి తెలిపారు. మూడు దశల్లో గర్భగుడి పునరుద్ధరణ, భక్తులకు సౌకర్యాలు, రహదారులు, సాంస్కృతిక కేంద్రాలు, తుంగభద్ర నదీతీర సుందరీకరణ చేపట్టనున్నారు. 

దర్శన వేళలు.. ప్రయాణ వివరాలు

ఆలయం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి 2 నుంచి రాత్రి 8.30 వరకు తెరిచి ఉంటుంది. చండీ హోమంలో పురుషులకు మాత్రమే అనుమతి ఉంది. ప్రత్యేక పూజలు, ఇ-హుండీ సేవలకు ఆలయ అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను సందర్శించవచ్చు. వివరాలకు 08502-241327, 85559 65827 నంబర్లను సంప్రదించవచ్చు. 

హైదరాబాద్‌‌‌‌ నుంచి అలంపూర్‌‌‌‌ సుమారు 215 కి.మీ దూరంలో ఉంది. జాతీయ రహదారి 44 మీదుగా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. అలంపూర్‌‌‌‌ రోడ్‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌ ఆలయానికి 9 కి.మీ దూరంలో ఉంది. కర్నూలు నుంచి ఆలయానికి సుమారు 28 కి.మీ ప్రయాణించాలి.