తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాదిమంది ఉద్యమకారులు పోరాడారు. నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు జరిగిన అన్యాయమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ముఖ్యంగా పాలమూరు– నారాయణపేటతోపాటు దక్షిణ తెలంగాణలోని రైతులకు సాగునీరు అందాలనే ఆకాంక్ష తెలంగాణ ఉద్యమానికి బలమైన స్ఫూర్తిని ఇచ్చింది. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే పాలమూరు ప్రాంతానికి కృష్ణాజలాల్లో న్యాయమైన వాటా రావాలని, దక్షిణ తెలంగాణ ప్రతి ఎకరాకు సాగునీరు అందాలని అనేక మంది ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నేను కూడా నా వంతుగా పోరాటం చేశాను.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు వ్యతిరేకంగా నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించి కేసువేశాను. తెలంగాణ ప్రయోజనాలకు, ముఖ్యంగా పాలమూరు– నారాయణ పేటతోపాటు దక్షిణ తెలంగాణ ప్రాంతాల నీటి హక్కులకు నష్టం కలగకూడదనే లక్ష్యంతో నా ఈ న్యాయపోరాటం సాగింది.
పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను అధికంగా తరలించే ప్రయత్నాలను ప్రశ్నిస్తూ సాగిన ఈ పోరాటం వెనుక ఉన్న ప్రధాన స్ఫూర్తి ఒక్కటే. పాలమూరు ప్రజలకు నీళ్లు రావాలి. నారాయణపేట రైతులకు సాగునీరు అందాలి. దక్షిణ తెలంగాణ ప్రతి ఎకరా పచ్చబడాలి. ఇది కేవలం ఒక ప్రాజెక్టుకు వ్యతిరేకమైన పోరాటం కాదు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన నీటి హక్కుల ఉద్యమ స్ఫూర్తిని కాపాడే పోరాటం. తెలంగాణ కోసం పోరాడిన నాయకత్వం..
రాయలసీమపై సానుకూల భాష ఎందుకు ?
తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ హయాంలోనే పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో తీవ్ర నీటివివాదం తలెత్తింది. 2020లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచే ప్రతిపాదనతోపాటు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్లింది. తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా అదే ధోరణితో ముందుకెళ్లింది. అయితే ఇదే సమయంలో తెలంగాణలోని ప్రతిపక్షాలు, ప్రజలు నేను కూడా కేసీఆర్–జగన్ మధ్య రాజకీయ అవగాహన ఉందని, జీవో 203 రూపకల్పన వెనుక కేసీఆర్ శిబిరం పాత్ర ఉందని ఆరోపించాం.
ఇక కేసీఆర్ రాయలసీమ అభివృద్ధిపై చేసిన ‘రాయలసీమను రతనాల సీమ చేస్తాం’ అన్న వ్యాఖ్య కూడా తర్వాత తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు వచ్చింది. తెలంగాణ కోసం వేలాది మంది ప్రాణత్యాగాలు చేసినప్పుడు, పాలమూరు– నారాయణపేటతో పాటు దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలు రావాలనే స్ఫూర్తి ఉద్యమానికి బలంగా ఉన్నప్పుడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాయలసీమ అభివృద్ధిపై అంత సానుకూలంగా మాట్లాడటం ఎందుకు? నా అభిప్రాయం ప్రకారం, తెలంగాణ ఉద్యమం ద్వారా ఏర్పడిన నీటి హక్కుల స్ఫూర్తిని కేసీఆర్ రాజకీయ విధానాలు దెబ్బతీశాయని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పోతిరెడ్డిపాడు విషయంలో అడగాల్సిన ప్రశ్నలివే..
కృష్ణా జలాల వినియోగంపై అధికారిక రికార్డులను కూడా ప్రజల ముందుంచాలి. కేఆర్ఎంబీ 2019–20 వార్షిక నివేదిక ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ 169.668 టీఎంసీల నీటిని డ్రా చేసినట్లు నమోదు అయింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిన లేఖలో 2019–20లో పోతిరెడ్డిపాడు ద్వారా 179 టీఎంసీల నీటిని తీసుకున్నట్లు పేర్కొంది. ఈ గణాంకాలను, ప్రాజెక్టుల సామర్థ్యాలను, నీటి కేటాయింపులను ప్రజలకు స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ప్రశ్నించాల్సింది.. పాలమూరు ప్రజల నీటి హక్కులకు ఎవరు అడ్డుగా నిలిచారు ?
పోతిరెడ్డిపాడు విషయంలో ఎవరు ఏంచేశారు? పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలు ఎవరు, ఎప్పుడు తీసుకున్నారు? కేసీఆర్– జగన్ రాజకీయ సాన్నిహిత్యంపై ఆరోపణల్లో వాస్తవం ఏమిటి? తెలంగాణ ఉద్యమం ఇచ్చిన నీటి హక్కుల స్ఫూర్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు బలహీనపడింది? రాయలసీమను ‘రతనాల సీమ’ చేస్తామని చెప్పిన రాజకీయ భాషలో పాలమూరు– నారాయణపేట రైతుల నీటి హక్కులకు స్థానం ఎక్కడ? ‘తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరుల ఆశయం నీటి లభ్యత. ఆ నీటి హక్కుల విషయంలో రాజీకి తావుండకూడదు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఎందుకు వేగం కనిపించలేదు?
‘పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం ఆపలేదని, వ్యూహాత్మకంగా పనులు కొనసాగించిందని శ్రీధర్ దేశ్‌పాండే ఓ దినపత్రిక వ్యాసంలో పేర్కొన్నారు. అయితే పాలమూరు ప్రజల తరఫున న్యాయపోరాటం చేసిన ఉద్యమకారుడిగా నేను అడిగే ప్రశ్నలు వేరుగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎదురైన న్యాయపరమైన, అనుమతుల సంబంధిత సమస్యలను ప్రభుత్వం పరిష్కరించుకుంటూ ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లగలిగినప్పుడు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఎందుకు అదే స్థాయిలో వేగం కనిపించలేదు ?
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మూల ప్రణాళికలు, నీటి వనరులు, కేటాయింపులు, పర్యావరణ అనుమతులు, కేంద్ర సంస్థల అభ్యంతరాలు, కోర్టు వివాదాలు ఇవన్నీ ఏ క్రమంలో జరిగాయో ప్రజల ముందుంచాలి. 2019–20లోనే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై రాజకీయ, నీటి హక్కుల వివాదాలు తీవ్రంగా ఉన్నాయి. కానీ, తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన పాలమూరు ప్రాంతానికి కృష్ణా జలాలు అందించడంలో ఎందుకు ఇంతకాలం సమస్యలు కొనసాగాయి?
పాలమూరు ప్రజలకు నీళ్లు కావాలి
పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నెలకొన్న అనేక ప్రశ్నలకు, ఇక్కడి ప్రజల అనుమానాలకు ఇప్పుడు సమాధానాలు కావాలి. పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఎవరు.. ఏ నిర్ణయం తీసుకున్నారు? ఏ జీవో ఎప్పుడు జారీ అయింది? ఏ నీటి వనరులను ప్రాజెక్టుకు అనుసంధానించారు? ఎప్పుడు, ఎందుకు ప్రాజెక్టు రూపకల్పనలో మార్పులు జరిగాయి? ఏ అనుమతులు ఎందుకు ఆలస్యమయ్యాయి? ఏ ప్రభుత్వం ఏ సమయంలో ఏ చర్య తీసుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు పత్రాలతో సహా ప్రజల ముందుంచాలి. అప్పుడే ఎవరి నిర్ణయాలు ఏ ప్రభావం చూపాయో చరిత్ర తేలుస్తుంది. పాలమూరు ప్రజలకు కావాల్సింది రాజకీయ వాదోపవాదాలు కాదు. నీళ్లు కావాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు కావాలి. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావాలి. పాలమూరు–నారాయణపేట రైతుల ప్రతి ఎకరాకు సాగునీరు కావాలి.
పాలమూరు ప్రజలకు కేసీఆర్ మోసం
తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన పాలమూరు ప్రజలకు నీళ్లు అందించడం కంటే గొప్ప తెలంగాణ ఉద్యమ గౌరవం మరొకటి లేదు. ‘పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌ని దుష్టశక్తులు కోర్ట్ కెళ్ళి ఆపాయి అని శ్రీధర్
దేశ్ పాండే ఓ వ్యాసంలో అన్నారు. మరి అదే దుష్టశక్తి కొల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న హర్షవర్ధన్ రెడ్డిని కేసీఆర్ పార్టీలో చేర్చుకొని పాలమూరు పట్ల పెద్ద దుష్టశక్తి అయ్యారు. ఉద్యమ సమయంలో అండగా ఉన్న ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా పాలమూరు ప్రజలను మోసం చేశారు కేసీఆర్. రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు.
తొమ్మిదిన్నర సంవత్సరాలు కాలం గడిపి ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా పాలమూరు ప్రజలకు తీరని ద్రోహం చేశారు కేసీఆర్. మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా మూడు అడుగులు కూడా ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగటం లేదు. ఇలా అన్ని పార్టీలు పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాయి. ఇప్పుడు స్వయంగా పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డే సీఎంగా ఉన్నారు. అందుకే సొంతగడ్డకు ఇప్పటికైనా న్యాయం చేయాలని పాలమూరు ప్రజల తరఫున కోరుతున్నాను.
గవినొళ్ల శ్రీనివాస్, సామాజిక కార్యకర్త, నారాయణపేట జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ [email protected]
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
