LIC హౌసింగ్ ఫైనాన్స్ వంటి దిగ్గజ సంస్థలకు ఏకంగా 99 శాతం నష్టాన్ని మిగుల్చుతూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఇచ్చిన సంచలన తీర్పు ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పులు చెల్లించలేక దివాలా తీసిన జీ మీడియా అధినేత సుభాష్ చంద్రకు సంబంధించిన కేసులో ట్రిబ్యునల్ వెలువరించిన ఈ తీర్పు.. రుణదాతల ఆశలపై నీళ్లు చల్లింది. మెజారిటీ క్రెడిటర్ల ఆమోదం ఉందనే కారణంతో కోట్లలో బాకీ ఉన్న కేసులో కేవలం లక్షల్లోనే రికవరీకి గ్రీన్ సిగ్నల్ లభించడం విస్మయానికి గురిచేస్తోంది.
ఈ కేసుకు సంబంధించి ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నేతృత్వంలోని అసమ్మతి క్రెడిటర్లు లేవనెత్తిన అభ్యంతరాలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. తమకు రావాల్సిన రూ.వెయ్యి 322 కోట్ల 39 లక్షల బకాయికి బదులుగా కేవలం రూ.38లక్షలు చెల్లించాలనే ప్రతిపాదన చాలా చిన్నదని.. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని వారు వాదించారు. అలాగే రూ.6 కోట్ల 50లక్షల పేఅవుట్ కూడా అంత స్పష్టంగా లేదని పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనను 80.81 శాతం ఓటింగ్ షేర్ కలిగిన మెజారిటీ క్రెడిటర్లు ఆమోదించారని, వ్యతిరేకించిన వారి వాటా 20 శాతం కంటే తక్కువేనని ఎన్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి ఆర్థిక సంస్థలకు ఊహించని భారీ నష్టం వాటిల్లింది. అసలు బాకీతో పోలిస్తే రూపాయిలో కనీస భాగం కూడా రాకపోవడంతో ఆ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే వ్యక్తిగత ఆస్తుల విలువ చాలా తక్కువగా ఉందని, ప్రస్తుత ప్లాన్ ద్వారానే కొంతైనా రికవరీ జరిగే అవకాశం ఉందని రిజల్యూషన్ ప్రొఫెషనల్ నివేదిక స్పష్టం చేసింది. ఒకరి వ్యక్తిగత దివాలా ప్రక్రియ పరిష్కారమైతే, ప్రధాన రుణగ్రహీతల నుంచి బకాయిలు రాబట్టుకోవడానికి క్రెడిటర్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది.
క్రెడిటర్ల వాణిజ్యపరమైన నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని, తమది కేవలం పర్యవేక్షణ, న్యాయపరమైన పాత్ర మాత్రమేనని NCLT తేల్చిచెప్పింది. సెక్షన్ 115 ప్రకారం ఆమోదించబడిన ఈ రీపేమెంట్ ప్లాన్ వ్యతిరేకించిన వారితో సహా అందరికీ వర్తిస్తుందని, అసమ్మతి క్రెడిటర్లు దీనికి వ్యతిరేకంగా బయట విడివిడిగా రికవరీ ప్రయత్నాలు చేయడానికి వీలుపడదని స్పష్టం చేసింది. తదుపరి చర్యల కోసం రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ను తుది జాబితా తయారు చేయాలని ఆదేశించింది.
ఈ పరిణామాల మధ్య జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెసెస్ లిమిటెడ్ షేర్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో జీఎల్ షేరు 0.43 శాతం లాభంతో రూ. 104.85 వద్ద కదలాడింది. గడచిన 6 నెలల్లో ఈ స్టాక్ సుమారు 19.87 శాతం వృద్ధిని చెందటం విశేషం.
