బెంగళూరు నగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకు వినూత్న ఆలోచనతో వచ్చింది కర్ణాటక సర్కార్. దీంతో ఐటీ రాజధాని నగర చరిత్రలోనే తొలిసారిగా టోల్ వసూలు చేసే సరికొత్త 'పెయిడ్ ఫ్లైఓవర్' నిర్మాణానికి అడుగులు పడ్డాయి. వినటానికి కొంత విచిత్రంగా ఉన్నప్పటికీ.. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే యశ్వంత్పూర్ నుంచి కేఆర్ పురం వరకు ఏకంగా 28 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన ఈ భారీ ఎలివేటెడ్ కారిడార్ టెండర్లను బెంగళూరు స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తాజాగా ఆహ్వానించింది. సుమారు రూ.3వేల 536 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ నగర రవాణాను పూర్తిగా మార్చేయనుంది.
ఈ భారీ ప్రాజెక్టు రూపకల్పనలో ప్రభుత్వం ఒక వినూత్న విధానాన్ని అవలంబిస్తోంది. సాధారణ కాంట్రాక్టుల మాదిరిగా ప్రభుత్వమే కనెక్షన్ పీరియడ్‌ను నిర్ణయించకుండా, టోల్ వసూలు చేసే కాలవ్యవధిని ప్రధాన బిడ్డింగ్ ప్రాతిపదికగా మార్చింది. బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ టోల్ మోడల్‌లో చేపట్టనున్న ఈ పనులకు 30 నెలల గడువు విధించారు. అయితే ఏ బిడ్డర్ కూడా గరిష్టంగా 32 ఏళ్ల 6 నెలలకు పైగా అంటే ఖచ్చితంగా చెప్పాలంటే 11వేల 863 రోజులు మించి టోల్ వసూలు చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. పెట్టుబడి, లాభాలు రాబట్టుకునేందుకు ఏ సంస్థకు తక్కువ రోజులు కావాలనేదే ఇక్కడ కీలకం కానుంది.
ఈ ఎలివేటెడ్ కారిడార్ మార్గం నగరంలోని కీలక ప్రాంతాలను కలుపుతూ సాగనుంది. యశ్వంత్పూర్ ఏరియాలోని మథికెరె క్రాస్ వద్ద ప్రారంభమై ఐఐఎస్సీ, మేఖ్రి సర్కిల్, జయమహల్, సెయింట్ జాన్స్ చర్చి రోడ్, హలసూరు సరస్సు మీదుగా ఓల్డ్ మద్రాస్ రోడ్ గుండా కేఆర్ పురం వరకు ఇది అనుసంధానించబడుతుంది. కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, మెట్రో మార్గాల వలె సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తూర్పు-పశ్చిమ ప్రాంతాల మధ్య డైరెక్ట్ లింక్‌ను ఈ ఫ్లైఓవర్ అందిస్తుంది. MEI జంక్షన్ వద్ద స్ప్లిట్ ఫ్లైఓవర్‌తో పాటు ఆర్టీ నగర్, ఇందిరానగర్ వంటి డజనుకు పైగా ప్రధాన జంక్షన్లను ఇది కవర్ చేయనుంది.
సివిల్ పనుల అంచనా ప్రకారం రూ.2వేల 710 కోట్లు కేవలం నిర్మాణానికే ఖర్చు కానుండగా.. ఇందులో సూపర్ స్ట్రక్చర్ వాటాయే దాదాపు 62 శాతానికి పైగా ఉంది. ఇరువైపులా 10 చొప్పున అప్, డౌన్ రాంప్స్‌తో 19.61 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లుగా నిర్మించనున్న ఈ మార్గంలో వాహనాలు గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. నగరవాసులకు వేగవంతమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు, ట్రాఫిక్ రద్దీని పూర్తిగా నివారించడంలో ఈ టోల్ ఫ్లైఓవర్ కీలక పాత్ర పోషించనుంది. త్వరలోనే బిడ్డర్లు ఖరారై పనులు ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుపై బెంగళూరు టెక్కీలు, వాహనదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
