టాప్ ఐటీ దిగ్గజం TCS ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి మిడ్, సీనియర్ లెవెల్ ఉద్యోగుల వేరియబుల్ పే కోత విధించింది. ఆపరేటింగ్ మార్జిన్లపై ఒత్తిడి, AI రంగంలో భారీ పెట్టుబడుల కారణంగా ఈ క్వార్టర్ లో సగటున 60 నుంచి 70 శాతం మాత్రమే వేరియబుల్ పే అందించినట్లు తెలుస్తోంది. గత రెండు క్వార్టర్లలో ఇది 80 శాతం వరకు ఉండగా.. తాజా నిర్ణయంతో సీనియర్ ఉద్యోగులకు నిరాశ ఎదురైంది.
గతంలో దాదాపు రెండేళ్ల పాటు మిడ్-సీనియర్ లెవెల్ ఉద్యోగులకు కేవలం 20 నుంచి 40 శాతం మాత్రమే వేరియబుల్ పే లభించింది. ఆ పోలికతో చూస్తే ఇది మెరుగ్గానే ఉన్నప్పటికీ.. గత క్వార్టర్‌తో పోలిస్తే మాత్రం 30 నుంచి 35 శాతం వరకు తగ్గిందని ఉద్యోగులు వాపోతున్నారు. గత మూడేళ్లుగా తమకు పూర్తిస్థాయిలో 100 శాతం వేరియబుల్ పే అందడం లేదని పలువురు సీనియర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. టీసీఎస్ వర్క్‌ఫోర్స్‌లో అత్యధికంగా ఉండే జూనియర్ బ్యాండ్ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి కోత విధించలేదు కంపెనీ. వీరికి ఎప్పట్లాగే 100 శాతం క్వార్టర్లీ బోనస్ అందిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కంపెనీ వార్షిక వేత పెంపును కూడా ప్రారంభించడంతో ఆపరేటింగ్ మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడింది. జూన్ క్వార్టర్‌లో ఆపరేటింగ్ మార్జిన్ 24 శాతానికి పడిపోయిందని, వార్షిక ఇంక్రిమెంట్ల కారణంగా మార్జిన్లు 170 బేసిస్ పాయింట్లు తగ్గాయని టీసీఎస్ సీఎఫ్‌వో సమీర్ సేక్సారియా వెల్లడించారు. భవిష్యత్తు కోసం ఏఐ ఆధారిత సామర్థ్యాలను పెంపొందించేందుకే ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు స్పష్టం చేశారు. మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఇదే క్వార్టర్‌లో వేరియబుల్ పేను 70 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే.
ఇక టీసీఎస్‌లో వేరియబుల్ పే కేవలం పనితీరుపైనే కాకుండా ఆఫీస్ అటెండెన్స్‌కు కూడా లింక్ చేసి ఉంది. మిగతా కంపెనీల మాదిరిగా హైబ్రిడ్ ఆప్షన్లు ఇవ్వకుండా.. టీసీఎస్ 5 రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది. ఆఫీస్ హాజరు 60 శాతం కంటే తక్కువ ఉంటే వేరియబుల్ పే పూర్తిగా కట్ అవుతుంది.
పూర్తి వేరియబుల్ పే రావాలంటే ఉద్యోగులు కనీసం 85 శాతం హాజరు ఉండాల్సిందే అని టీసీఎస్ గతంలోనే వెళ్లడించింది. హాజరు 75-85 శాతం ఉంటే 75 శాతం వేరియబుల్ పే, 60-75 శాతం ఉంటే కేవలం 50 శాతం మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టారు. ఏఐ టెక్నాలజీల వైపు అడుగులు వేస్తున్న టీసీఎస్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు ప్రస్తుతం టెక్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారాయి.
