ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో కాల్పుల ఘటన వెలుగు చూసింది. ప్రముఖ హర్యానీ గాయకుడు, యూట్యూబర్ అయిన 35 ఏళ్ల అంకిత్ బలియాన్ దారుణ హత్యకు గురయ్యారు.
షామ్లీలోని ఒక జిమ్‌కు గత ఏడాది కాలంగా అంకిత్ రోజు తప్పకుండా వెళ్ళేవాడు. ఎప్పటిలాగే బుధవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో జిమ్‌లో వ్యాయామం తరువాత బయటకు వచ్చి దాదాపు 20-25 మీటర్ల దూరంలో ఉన్న తన కారు దగ్గరకు వెళ్తుండగా నలుగురు దుండగులు ఒక్కసారిగా గన్స్ తో దాడి చేశారు. అంకిత్‌పై సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపారు. తలతో పాటు శరీరంపై తీవ్ర బుల్లెట్ గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
గోగి గ్యాంగ్ బాధ్యత.. పోలీసులకు వార్నింగ్
ఈ హత్యకు తామే బాధ్యులమని కుఖ్యాతి చెందిన 'గోగి గ్యాంగ్' సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అంకిత్ మా శత్రు వర్గంతో సంబంధాలు పెట్టుకున్నాడని, మా గ్యాంగ్‌కు సంబంధించిన ఒక ఘటన ఆధారంగా పాట కూడా రాశాడని ఆరోపించింది. గోగి గ్యాంగ్ తో సంబంధం ఉన్న భోలు షాపురియా అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. "ఇది కేవలం ఆరంభం మాత్రమే, అందరి వంతు వస్తుంది" అని పోస్ట్ చేశాడు. అంతేకాకుండా యూపీ పోలీసులను కూడా బెదిరిస్తూ మరిన్ని హత్యలు జరుగుతాయని హెచ్చరించాడు.
సొంత పాటలాగే మారిన దారుణం
అంకిత్ బలియాన్ పాడిన హిట్ పాట 'భారీ కోర్ట్ మే గోలీ మారేంగే మేరీ జాన్' (కోర్టులోనే నిన్ను కాల్చి చంపుతాం).... తుపాకీ సంస్కృతి, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంపై పాటలు రాసి, పాడిన అంకిత్.. చివరికి అదే తరహా తుపాకీ హింసకు బలైపోవడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
సినీ, డిజిటల్ కెరీర్
షామ్లీలోని బంతిఖేరా గ్రామానికి చెందిన అంకిత్.. రోహ్‌తక్, సోనిపత్‌లో నివసిస్తూ సంగీత ప్రపంచంలో స్థిరపడ్డారు. 'మోడీ బర్గా రుత్బా', 'సిస్టమ్', 'సవిధాన్', 'గోలీ కే బరూద్', '112 NE' వంటి చాల పాపులర్ పాటలను పాడి, నిర్మించారు. మసూమ్ శర్మ, రాజు పంజాబీ, ఆశు ట్వింకిల్ వంటి ప్రముఖ హర్యానీ ఆర్టిస్టులతో కలిసి పనిచేశారు. పాటలతో పాటు రాజకీయ నాయకులను, సామాజిక ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ పొలిటికల్ పాడ్‌కాస్ట్‌లు, వ్లాగ్స్ కూడా చేసేవారు.
పోలీసుల దర్యాప్తు, బంధువుల నిరసన
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పాత కక్షలు, రాబోయే పంచాయతీ ఎన్నికల కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు, నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ అంకిత్ కుటుంబ సభ్యులు, స్థానికులు మృతదేహంతో ఢిల్లీ-ముజఫర్‌నగర్ రహదారిపై బైఠాయించి తీవ్ర నిరసన చేపట్టారు. హంతకులను అరెస్టు చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని స్పష్టం చేశారు.
