తన కూతురు సుస్మితా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వివరణ ఇచ్చారు. కూతురు వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన అనంతరం మీడియా మాట్లాడిన కొండా మురళి.. కూతురు వేరు, రాజకీయం వేరన్నారు.
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి..ఆమె మనోభావాలు ఆమెకు ఉంటన్నాయన్నారు. స్వతంత్ర్యంగా మాట్లాడే హక్కు సుస్మితకు ఉందన్నారు. ఆమెను ప్రశ్నించే హక్కు తమకు లేదన్న కొండా మురళి... తాము కాంగ్రెస్ లోనే కొనసాగుతామని చెప్పారు. గాంధీ ఫ్యామిలీపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.
కమిటీకి తాము చెప్పాల్సింది చెప్పామన్నారు మురళి. ప్లాన్ ఏనా, ప్లాన్ బీనా బిడ్డ చూసుకుంటుందన్నారు. నియోజకవర్గ బిల్లుల కోసమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశామన్నారు కొండా మురళి.
కొండా సురేఖను పదవి నుంచి తప్పించాలె
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి పార్టీలో మాత్రం కొనసాగించవచ్చని హైకమాండ్కు పీసీసీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించాయి. అదే సమయంలో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి. పైగా కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మంత్రి సురేఖ ఇచ్చిన సమాధానంలో ఎక్కడా తన కూతురు చేసిన విమర్శలను ఖండించడంగానీ, వ్యతిరేకించడం గానీ చేయలేదని పేర్కొన్నట్టు తెలిసింది.
సీఎం రేవంత్ సహా పార్టీ నేతలపై తన కుమార్తె సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి సురేఖ ఎలాంటి పశ్చాత్తాపం ప్రకటించలేదు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తననెలా బాధ్యురాలిని చేస్తారని, ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమంటూ వితండవాదానికి దిగారు. పైగా తనకు నోటీసు ఇవ్వడమే సరికాదన్నట్టు, నోటీసునే వెనక్కి తీసుకోవాలన్న వాదన వినిపించారు. ఇది సుస్మిత వ్యాఖ్యలను సురేఖ సమర్థించడమే అవుతుంది” అని కమిటీ అభిప్రాయపడినట్టు సమాచారం.
