- ఒకసారి వేస్తే 40 ఏండ్ల వరకు దిగుబడి
- ఎకరాకు ఏటా రూ.3 లక్షల ఆదాయం
- 3 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట
- 10 లక్షల ఎకరాలకు పెంచాలని టార్గెట్
- జాతీయ సాగులో రాష్ట్రం వాటా 36 శాతం
- ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే టాప్
ఖమ్మం/ కొణిజర్ల, వెలుగు: సరైన పంటను ఎంచుకొని, శాస్త్రీయ యాజమాన్యంతో సాగు చేస్తే వ్యవసాయం ద్వారా కూడా మంచి ఆదాయం సాధించవచ్చని రాష్ట్ర రైతులు నిరూపిస్తున్నారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగు రైతుల ఆర్థికస్థితిని మార్చేస్తున్నది.
ఒకసారి తోట వేస్తే 35 నుంచి 40 ఏండ్లపాటు దిగుబడి రావడం, ప్రతి 15 రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలో కోతలు రావడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కొనుగోలు భరోసా, జిల్లాల వారీగా ప్రాసెసింగ్ పరిశ్రమలు అందుబాటులో ఉండటంతో పామాయిల్ సాగు వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్‌గా మారింది. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్’ పథకంలో దేశంలోనే తెలంగాణ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. జాతీయ ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ వాటా 36 శాతంగా నమోదైంది.
దేశ వ్యాప్తంగా 2021 నుంచి 2026 మధ్య 2.73 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకాగా.. అందులో 98,112 హెక్టార్లు తెలంగాణలోనివే. రాష్ట్రంలో ప్రస్తుతం 79,448 మంది రైతులు 1.16 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ వేశారు. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.23,852 ఉండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
రానున్న రోజుల్లో ఇది రూ.25 వేలకు పెరుగుతుందని రైతులు ధీమాగా ఉన్నారు. తక్కువ నీటితో సాగుకావడం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఉండడం, చీడ పీడలు, కోతుల బెడద లేకుండా దీర్ఘ కాలం లాభాలు అందించే పంట కావడంతో క్రమంగా రైతులు ఈ పంట వైపు మొగ్గుచూపుతున్నారు. నిరంతరంగా ఆదాయం వస్తుండటంతో నెలవారీ జీతంలాగా ఆర్థిక భరోసా ఉంటుందని అన్నదాతలు అంటున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతో విస్తరిస్తున్న సాగు
రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు వచ్చే మూడేండ్లలో10 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. డ్రిప్ ఇరిగేషన్, సబ్సిడీపై నాణ్యమైన మొక్కలు, సాంకేతిక మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నది. ఎకరానికి 57 ఆయిల్ పామ్ మొక్కలు నాటాలి. ఈ మొక్కలను ఉద్యాన శాఖ సబ్సిడీ మీద సప్లై చేస్తోంది.
ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగులో కూలీల అవసరం తక్కువ. డ్రిప్ సిస్టమ్ వల్ల నీటి ఆదా జరుగుతుంది. మొక్కలు నాటిన తర్వాత మూడున్నర నుంచి నాలుగేండ్లలో పంట దిగుబడి ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు ఎకరానికి ఏటా రూ. 51 వేలు రాయితీల రూపంలో రైతులకు అందుతాయి. అంతర పంటలుగా కోకో, జాజికాయ, వక్క, పత్తి, పెసర, పుచ్చకాయల సాగు కూడా చేసుకోవచ్చు.
పామాయిల్ తాజా పండ్ల గుత్తులను (ఎఫ్‌ఎఫ్‌బీ) సేకరించేందుకు జిల్లాల వారీగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తుండడంతో మార్కెటింగ్ ఎలాగన్న ఆందోళన కూడా ఉండదు. ఐదు ఎకరాలకు పైగా భూమి, నీటి వసతి ఉన్న రైతులకు ఆయిల్‌పామ్ లాభదాయకమైన ప్రత్యామ్నాయంగా మారుతున్నది.
ఇప్పటికీ విదేశాల నుంచి దిగుమతే ఎక్కువ
మన దేశంలో క్రమంగా ఆయిల్ పామ్ సాగు పెరుగుతున్నా.. ఇప్పటికీ విదేశాల నుంచి పెద్ద మొత్తంలో పామాయిల్ దిగుమతి అవుతున్నది. నిరుడు 200 లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి చేసుకుంటే, అందులో పామాయిల్ దిగుమతులే 59 శాతం వరకు ఉంది. మన దేశం ఏడాదికి రూ.85 వేల నుంచి లక్ష కోట్ల విలువైన పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నది.
మన దేశం దిగుమతి చేసుకునే పామాయిల్ విలువ కొన్ని చిన్న రాష్ట్రాల ఏడాది బడ్జెట్ కంటే ఎక్కువగా ఉందని అంచనా. భారీ దిగుమతుల వల్ల విదేశీమారక ద్రవ్యాన్ని కూడా కోల్పోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి పామాయిల్ విస్తీర్ణాన్ని పెంచడం మీద సర్కారు ఫోకస్ పెడుతోంది.
40 ఏళ్ల కిందటే..
అప్పటి సీఎం ఎన్టీఆర్ హయాంలో 40 ఏండ్ల కింద ఖమ్మం జిల్లాలో ఆయిల్పామ్ సాగు ైూయక్షేత్రంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ పామ్ సాగు చేశారు.
నా కొడుకుతో సమానంగా ఆదాయం
నాకు ఉన్న 15 ఎకరాల్లో 18 ఏండ్ల కిందటే ఆయిల్ పామ్ సాగు ప్రారంభించాను. మొదట మూడేండ్లు అంతర పంటలు సాగు చేసి ఆదాయం పొందాను. ఆ తర్వాత నుంచి ఆయిల్ పామ్ తోటే మా కుటుంబానికి స్థిరమైన ఆదాయ వనరుగా మారింది. నా కుమారుడిని ఇంజినీరింగ్ చదివించడానికి లక్షల్లో ఖర్చు చేశాను. ఇప్పుడు అతను ఉద్యోగం చేస్తున్నాడు. అతడి ఉద్యోగం మాకు గర్వకారణమే. పామాయిల్ ద్వారా నా కొడుకు సంపాదిస్తున్న స్థాయిలో .. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నాను. నిరుడు ఎకరానికి సుమారు 14 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుత ధరల ప్రకారం ఎకరానికి ఏడాదికి రూ.3.30 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది.
- కంచేటి భద్రయ్య, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా
