మూసీ పనులు పరుగులు పెట్టాలి.. ఫేజ్-2 పనులకు వెంటనే టెండర్లు పిలవండి

మూసీ పనులు  పరుగులు పెట్టాలి.. ఫేజ్-2 పనులకు వెంటనే టెండర్లు పిలవండి
  • భూసేకరణ వేగవంతం చేయండి: సీఎం రేవంత్​రెడ్డి 
  • ల్యాండ్‌‌‌‌‌‌‌‌ పూలింగ్‌‌‌‌‌‌‌‌పై స్పష్టమైన విధానం ఉండాలి
  • ఫేజ్-2 పనులకు వెంటనే టెండర్లు పిలవండి 
  • ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రుణాలపై దృష్టి పెట్టండి
  • టీడీఆర్‌‌‌‌‌‌‌‌పై వారానికో సమీక్ష నిర్వహించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించాలని, ఎక్కడా జాప్యం జరగడానికి వీల్లేదని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌‌ఆర్‌‌డీలోని బోధి పెవిలియన్‌‌లో మూసీ ప్రాజెక్టు ప్రగతిపై సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. 

మూసీ ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయి ఐకాన్‌‌గా మార్చాలన్నదే సర్కారు లక్ష్యమని, ఆ దిశగా ప్రతి విభాగం పూర్తి బాధ్యతతో పనిచేయాలని  స్పష్టం చేశారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేయాలని సీఎం స్పష్టం చేశారు.

 బాధితులకు అన్యాయం జరగకుండా చూస్తూనే, క్షేత్రస్థాయిలో యంత్రాంగం సమన్వయంతో కదలాలని చెప్పారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులు రోజువారీగా పనులను మానిటర్ చేస్తూ.. నిర్దేశించిన టైమ్‌‌లైన్ల ప్రకారం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

 భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా అత్యంత పారదర్శకంగా ‘ల్యాండ్‌‌ పూలింగ్‌‌’పై పక్కా విధానాన్ని వెంటనే రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. మూసీ పరివాహకంలోని ఎఫ్‌‌టీఎల్‌‌ (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్‌‌ జోన్లు, అసైన్డ్‌‌ భూముల గుర్తింపు, సేకరణ విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై స్పష్టమైన గైడ్‌‌లైన్స్‌‌తో పాలసీ తయారు చేయాలన్నారు.

 ప్రాజెక్టు ముందుకు సాగే కొద్దీ కోర్టు వివాదాలు, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా రెవెన్యూ రికార్డులను ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించి లీగల్ సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. భూములు కోల్పోయే బాధితులకు మేలు చేసే ట్రాన్స్‌‌ఫరబుల్ డెవలప్‌‌మెంట్ రైట్స్ (టీడీఆర్‌‌-) జారీపై అలసత్వం వహించవద్దని, టీడీఆర్ పురోగతిపై ప్రతి వారం తప్పనిసరిగా రివ్యూ మీటింగ్‌‌లు నిర్వహించాలని స్పష్టం చేశారు. 

రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు స్థానిక ప్రజలతో స్వయంగా మాట్లాడి, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రాజెక్ట్ అవసరాల కోసం ల్యాండ్‌‌ను వేగంగా క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు.

కొత్వాల్‌‌గూడ బర్డ్స్‌‌ పార్కుకు విస్తృత ప్రచారం కల్పించాలి

మూసీ డెవలప్‌‌మెంట్‌‌ ఫేజ్-2 పనులను వేగవంతం చేయడంలో భాగంగా వీలైనంత త్వరగా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టులకు కావాల్సిన నిధుల సమీకరణలో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, ఆర్థిక సంస్థలు, అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి అతి తక్కువ వడ్డీకి వచ్చే దీర్ఘకాలిక రుణాలపై దృష్టి పెట్టాలని సూచించారు. 

మూసీ ఆధునికీకరణతో పాటు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేయాలని స్పష్టం చేసిన సీఎం.. మంచిరేవులలోని చారిత్రక ఓంకారేశ్వరస్వామి టెంపుల్ డెవలప్‌‌మెంట్‌‌కు సంబంధించిన టెండర్లను తక్షణమే పిలవాలని ఆదేశించారు. అలాగే నగర శివారులో సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన కొత్వాల్‌‌గూడ బర్డ్స్ పార్కుకు పెద్దఎత్తున ప్రచారం కల్పించి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఈ  భేటీలో సీఎం ముఖ్య కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, మల్కాజ్‌‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, మేడ్చల్‌‌ కలెక్టర్‌‌ మను చౌదరి, ఎంఆర్‌‌డీసీఎల్ ఎండీ ఈ.వి. నరసింహ రెడ్డి, జేఎండీ గౌతమితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.