ఇరాన్ ఊహకందని విధంగా ఆర్థికంగా నష్టపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. సైన్యంలోని పెద్ద విభాగాలకు వేతనాలు కూడా ఇవ్వలేకపోతోందని తెలిపారు. ఆందోళనకారులను ప్రభుత్వం ఊచకోత కోస్తోందని ఆరోపించారు.
వాషింగ్టన్: ఇరాన్‌లో ఊహకందని రీతిలో మానవతా సంక్షోభం తలెత్తిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆర్థికంగా భారీ స్థాయిలో పతనమవుతున్న ఆ దేశం సైన్యంలోని పెద్ద విభాగాలకు వేతనాలు చెల్లించడం లేదన్నారు.
అలాగే, దేశంలో ప్రస్తుతం ఎలాంటి ఆందోళనలు జరగకుండా, ప్రశాంతంగానే ఉన్నప్పటికీ ఆందోళనకారులను ప్రభుత్వం ఊచకోత కోస్తోందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితిని ‘ఊహకందని తీవ్రమైన మానవతా సంక్షోభం’గా ఆయన అభివర్ణించారు.
కాగా, ఇరాన్ ఆర్థిక జీవనాధారాలను దెబ్బతీసే లక్ష్యంతో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ సోమవారం ‘‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్‌కాస్ట్’’ పేరుతో కొత్త చర్యలు ప్రారంభించారు. డిజిటల్ అసెట్స్, టెక్నాలజీ, బంగారం, విమానయానం, షిప్పింగ్ రంగాలు లక్ష్యంగా ఆంక్షలు ప్రకటించారు.
అలాగే, ఇరాన్‌కు సహాయం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 60కి పైగా సంస్థలు, వ్యక్తులు, నౌకలపైనా ఆంక్షలు విధించారు. ఇరాన్ చమురు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను గుర్తించామని, ‘జీరో లీకేజ్’ విధానాన్ని అనుసరిస్తామని బెస్సెంట్ చెప్పారు. నిర్ణీత కాలపరిమితిలోపు గుర్తించిన కార్యకలాపాలను నిలిపివేయాలని, లేకపోతే అమెరికా ఏకపక్ష చర్యలను, విస్తృత ద్వితీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నాలుగు భారత కంపెనీలపై ఆంక్షలు
ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయనే ఆరోపణలతో పోర్టీజ్ పార్ట్‌నర్స్ ఎల్ఎల్‌పీ, సదాశివ ఓవర్సీస్, పీపీ సాఫ్ట్‌టెక్, ప్రకృతీస్ ఇన్ఫ్రా ఇంటెక్ ఇండియా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ ఆర్థిక నెట్‌వర్క్‌లను కట్టడి చేయడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. అయితే, ఇరాన్ చమురు వ్యాపారానికి సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్న ఏ ఒక్క చైనా ఆర్థిక సంస్థ కూడా ఈ జాబితాలో లేదు.
