హైదరాబాద్, వెలుగు: ఎరువుల ధరల్లోని భారీ వ్యత్యాసాల కారణంగా రైతులు తక్కువ ధరకు లభించే యూరియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను హేతుబద్ధీకరణ చేసి, రైతులు సమతుల్యంగా ఎరువులు వినియోగించేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గత పదేండ్లలో రాష్ట్రంలో యూరియా వాడకం భారీగా పెరిగిందన్నారు. ప్రస్తుతం 45 కిలోల యూరియా బస్తా రూ.240 నుంచి రూ.266కే లభిస్తుండగా, 50 కిలోల డీఏపీ ధర రూ.1,350గానూ, 19:9:19 కాంప్లెక్స్ ఎరువు ధర రూ.1,750గానూ ఉందని పేర్కొన్నారు. ఈ ధరల మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసమే రైతులు యూరియా వైపు మళ్లడానికి ప్రధాన కారణమని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ నిలకడగా కొనసాగాలంటే సమతుల్య ఎరువుల వినియోగం ఎంతో అవసరమని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వాడాలని రైతులకు సూచించారు.
రైతు నేస్తం కార్యక్రమం ద్వారా అవగాహన..
యూరియా అధిక వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సమతుల్య ఎరువుల ప్రాధాన్యతపై 'రైతునేస్తం' కార్యక్రమం ద్వారా రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం 104వ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఎరువుల వినియోగం, నానో యూరియాపై తగు సూచనలు చేశారు.
