ఎఫ్‌‌ఐఆర్‌‌ రద్దుపై ఎల్‌‌పీఏ చెల్లదు..క్రిమినల్‌‌ అంశాలపై ఇంట్రా కోర్టు అప్పీల్‌‌కు అవకాశం లేదు

ఎఫ్‌‌ఐఆర్‌‌ రద్దుపై ఎల్‌‌పీఏ చెల్లదు..క్రిమినల్‌‌ అంశాలపై ఇంట్రా కోర్టు అప్పీల్‌‌కు అవకాశం లేదు
  •     ఎఫ్‌‌ఐఆర్‌‌ రద్దు చేస్తే నేర విచారణపై ప్రభావం చూపుతుంది
  •     సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వులపై దాఖలైన అప్పీల్‌‌ను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు: ఎఫ్‌‌ఐఆర్‌‌ రద్దు చేయాలన్న అభ్యర్థనపై సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌‌ చేస్తూ దాఖలు చేసిన లెటర్స్‌‌ పేటెంట్‌‌ అప్పీల్‌‌ (ఎల్‌‌పీఏ)ను హైకోర్టు కొట్టివేసింది. ఎఫ్‌‌ఐఆర్‌‌ రద్దు చేస్తే నేర విచారణపై ప్రభావం పడుతుందని.. ఇది క్రిమినల్‌‌ జ్యూరిస్డిక్షన్‌‌కు సంబంధించిన అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. క్రిమినల్‌‌ పరిధిలోని అంశాలపై లెటర్స్‌‌ పేటెంట్‌‌ కింద ఇంట్రా కోర్టు అప్పీల్‌‌ దాఖలు చేసే అవకాశం లేదని తేల్చిచెప్పింది. ప్రైవేటు భూవివాదం నేపథ్యంలో తమపై నమోదైన ఎఫ్‌‌ఐఆర్‌‌ను రద్దు చేయాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. భూమికి సంబంధించి సివిల్‌‌ కేసులు నడుస్తున్నాయని.. పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నారని వారు వాదించారు. అయితే ఆరో ప్రతివాది ఇచ్చిన ఫిర్యాదుతో అక్రమంగా భూమిలోకి ప్రవేశించడం, ఆస్తికి నష్టం కలిగించడం, దుర్భాషలాడటం, బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై కేసు నమోదైందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 

కేసులో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌‌ కూడా దాఖలు చేసినట్లు ప్రభుత్వం వివరించింది. ఎఫ్‌‌ఐఆర్‌‌ రద్దుకు సింగిల్‌‌ జడ్జి నిరాకరించడంతోపాటు.. చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా పిటిషనర్లపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాల్‌‌ చేస్తూ పిటిషనర్లు ఎల్‌‌పీఏ దాఖలు చేశారు. అప్పీల్‌‌ను విచారించిన ధర్మాసనం.. పిటిషన్‌‌ పేరు కంటే అందులో కోరిన ఉపశమనమే కీలకమని పేర్కొంది. ఎఫ్‌‌ఐఆర్‌‌ రద్దు కోరడం క్రిమినల్‌‌ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ అప్పీల్‌‌ను కొట్టివేసింది. పిటిషనర్‌‌కు చట్టప్రకారం అందుబాటులో ఉన్న ఇతర పరిహార మార్గాలపై తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.