సైదాపూర్, వెలుగు: సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్టులో భాగంగా సర్వాయిపేటలో నిర్మిస్తున్న మ్యూజియం, ఇతర పనులను స్పీడప్ చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ‘పల్లెపల్లెకు పొన్నం అన్న–పల్లెపల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట, పెరుకపల్లి, గొల్లగూడెం, ఆకునూరు, వెంకటేశ్వర్లపల్లి, ఘనపూర్ గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ పనులను పరిశీలింశారు. విగ్రహ ఏర్పాటు, పరిసరాల అభివృద్ధికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సర్వాయిపేట పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్‌ను ప్రారంభింపజేస్తామని వెల్లడించారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ
సర్వాయి పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం పశువైద్య శిబిరాన్ని ప్రారంభించి పశువులకు గర్భకోశ వ్యాధుల నివారణకు మందులు వేశారు.
