కొడిమ్యాల: 20 ఏండ్ల నిరీక్షణకు తెర...భూ పరిహారం కింద రూ.48 లక్షలు అందుకున్న ఏడుగురు రైతులు

కొడిమ్యాల: 20 ఏండ్ల నిరీక్షణకు తెర...భూ పరిహారం కింద రూ.48 లక్షలు అందుకున్న ఏడుగురు రైతులు
  •     ఎమ్మెల్యే సత్యం చొరవతో బాధితులకు న్యాయం

కొడిమ్యాల,వెలుగు: ఏడుగురు రైతుల 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. భూములు కోల్పోయి కష్టాలు పడుతున్న పేదలకు నష్టపరిహారం దక్కింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పోతారం చెరువును ప్రాజెక్టుగా మార్చేందుకు ప్రభుత్వం గతంలో రైతుల నుంచి భూసేకరణ చేపట్టింది. భూములు కోల్పోయిన రైతులందరికీ గతంలోనే ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెక్కులు అందాయి. 

అయితే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారనే కారణంతో మండలంలోని కోనాపూర్, పోతారం తిరుమలాపూర్ గ్రామాలకు చెందిన ఏడుగురు రైతులకు చెందిన 6.33 ఎకరాల భూమికి నష్టపరిహారం ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బాధితులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఒప్పించి ఏడుగురు రైతులకు రూ.48,11,880 విలువైన చెక్కులను మంగళవారం అందజేశారు. పరిహారం కోసం 20 ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న రైతులు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేశ్, ఎంపీడీవో స్వరూప, నాగభూషణ్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, పలువురు నాయకులు, ఇరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.