సిద్దిపేట రూరల్, వెలుగు : జిల్లాలో భూముల రీ సర్వేను పారదర్శకంగా చేపట్టి గడువులోగా పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి సర్వేల్యాండ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో ప్రభుత్వ భూమి రీ సర్వే ప్రక్రియను ఆమె పరిశీలించి మాట్లాడారు. ప్రతీ లైసెన్స్‌డ్ సర్వేయర్ వారికి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా భూ పునఃసర్వే పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పని చేయాలన్నారు.
అనంతరం గ్రామంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఈత, వేప మొక్కలను నాటారు. ఆ తర్వాత చిన్నగుండవెల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనం, టీచర్ల పనితీరును పరిశీలించారు.
రోజూ మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ పై యాక్షన్ తీసుకోవాలని డీఈఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. స్కూల్ ఆవరణలోని ఎంపీపీఎస్ స్కూల్ లో మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులకు వడ్డించారు.
