వన సంరక్షణ కీలకం...ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ‘వనమహోత్సవం’ ప్రారంభం

వన సంరక్షణ కీలకం...ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ‘వనమహోత్సవం’ ప్రారంభం
  •     మొక్కలు నాటిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు, ఇతరులు​

వెలుగు, నెట్​వర్క్​: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం వన మహోత్సవంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెంపు, భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని పలువురు పిలుపునిచ్చారు. వరంగల్ సిటీ రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కలెక్టర్ సత్యశారద, ఇతర ఆఫీసర్లతో కలిసి మొక్కలు నాటారు. 

ఖమ్మం స్తంభాద్రి ప్రకృతి వనం (వెలుగుమట్ల) అర్బన్ పార్కులో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సీపీ సునీల్ దత్‌‌‌‌‌‌‌‌తో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వృక్షప్రసాదాలను పంపిణీ చేశారు. అంతకుముందు మంత్రి వెలుగుమట్ల పార్క్ ను స్తంభాద్రి ప్రకృతి వనం గా నామకరణం, లోగోను ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ అందించిన బ్యాటరీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లో కలెక్టర్లు, అటవీశాఖతోపాటు ఇతర శాఖల ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.