కోల్బెల్ట్: సొంతింటి కల సాకారం..20 నెలల తర్వాత రెండో విడత పంపిణీ

కోల్బెల్ట్: సొంతింటి కల సాకారం..20 నెలల తర్వాత రెండో విడత పంపిణీ
  • లక్కీ డ్రా ద్వారా 307 మందికి డబుల్​ బెడ్రూం ఇండ్ల కేటాయింపు
  •     త్వరలో ప్రొసీడింగ్స్​ను పంపిణీ చేస్తామన్న ఆఫీసర్లు

కోల్​బెల్ట్, వెలుగు: డబుల్ ​బెడ్రూం ఇండ్ల కోసం 20 నెలలుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల నెరవేరింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిర్మించిన డబుల్​ బెడ్రూం ఇండ్ల కేటాయింపు కోసం అధికారులు మంగళవారం లక్కీ డ్రా నిర్వహించి 307 ఇండ్లను పేదలకు కేటాయించారు. 

మొదటి విడతలో 243 ఇండ్ల కేటాయింపు

మందమర్రి పట్టణంలోని పాలచెట్టు ఏరియాలో బీఆర్ఎస్​ హయంలో రూ.20.68 కోట్లతో 21 ఎకరాల్లో 560 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. 2023 నాటికి 400 ఇండ్లు మాత్రమే పూర్తికావడంతో లబ్ధిదారుల ఎంపికకు అధికారులు ధరఖాస్తులు స్వీకరించగా దాదాపు 5 వేల మంది అప్లై చేసుకున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన సర్వేపై పలు ఆరోపణలు వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫీసర్లు మరోసారి సర్వే చేసి అర్హులను ఎంపిక చేశారు. ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి ఆదేశాలతో గతేడాది తొలి విడతలో 253 మందితో కూడిన లిస్టును రూపొందించి జనవరిలో 243 మందికి లక్కీడ్రా ద్వారా ఇండ్లను కేటాయించారు. డబుల్​ఇండ్లలో కనీస వసతులకు నిధులు కేటాయించి పనులు చేపట్టారు.

20 నెలల తర్వాత రెండో విడత లక్కీ డ్రా

మిగిలిన ఇండ్ల వద్ద అభివృద్ధి పనులు చేపట్టి, అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేశారు. 307 ఇండ్ల కేటాయింపునకు 470 మందిని అర్హులుగా గుర్తిం చారు. 20 నెలల తర్వాత ఎట్టకేలకు రెండో విడత ఇండ్ల కేటాయింపు కోసం మంగళవారం సండ్రోనిపల్లిలోని కేఆర్​ ఫంక్షన్​హాల్ కలెక్టర్​ కుమార్​ దీపక్​ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. డీసీపీ ఎ.భాస్కర్ పర్యవేక్షణలో తహసీల్దార్ ​సతీశ్​ కుమార్ శర్మ, మున్సిపల్​ కమిషనర్​ తుంగపిండి రాజలింగు, హౌసింగ్​పీడీ బన్సీలాల్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్​ కుమార్, మందమర్రి సీఐ పర్స రమేశ్​ తదితరులు పాల్గొని పారదర్శకంగా చేపట్టారు. 

గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు వేదిక వద్దకు కేవలం లిస్టులో పేర్లు ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. లక్కీ డ్రా ప్రక్రియ అనంతరం మాట్లాడిన కలెక్టర్ త్వరలో ప్రొసీడింగ్స్​ను  పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇండ్లను సొంతం చేసుకున్న లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేవు. మంత్రి వివేక్​ వెంకటస్వామి కృషితోనే అధికారులు ఇండ్లను కేటాయించారని ఆయనకు ధన్యవాదాలుతెలిపారు.