హైదరాబాద్లో17 అక్రమ నిర్మాణాల కూల్చివేత షురూ.. మరో 11 బిల్డింగులకు నోటీసులు

హైదరాబాద్లో17 అక్రమ నిర్మాణాల కూల్చివేత షురూ.. మరో 11 బిల్డింగులకు నోటీసులు
  • మై క్యూర్‌‌‌‌, ప్రజావాణిలో 54 నిర్మాణాల గుర్తింపు  

హైదరాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు: సీఎంసీ పరిధిలో మంగళవారం అధికారులు 17 అక్రమ  నిర్మాణాల కూల్చివేతలు మొదలుపెట్టారు. శేరిలింగంపల్లి జోన్‌‌‌‌లో ఏడు,  కూకట్‌‌‌‌పల్లి జోన్‌‌‌‌లో 2, కుత్బుల్లాపూర్ జోన్‌‌‌‌లో 8 నిర్మాణాలు ఉన్నాయి. వీటితో పాటు నిర్మాణంలో ఉన్న మరో 11భవనాలకు నోటీసులు జారీ చేశారు. మై క్యూర్‌‌‌‌, ప్రజావాణి ఫిర్యాదులు, అధికారుల తనిఖీల్లో  54 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. 

నార్సింగిలో 60 గజాల్లో ఏడు ఫ్లోర్లు... 

నార్సింగి సర్కిల్ లోని గిరిగిరిగడ్డ ప్రాంతంలో 60 గజాల స్థలంలో 7 ఫ్లోర్లతో పాటు పెంట్ హౌస్ నిర్మిస్తుండగా మంగళవారం కూల్చివేత పనులు మొదలు పెట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు రెండు అంతస్థులకు  అనుమతి తీసుకుని  ఏకంగా ఏడు ఫ్లోర్లు వేశారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 

మూడోరోజూ కొనసాగిన కూల్చివేతలు 

గచ్చిబౌలి, వెలుగు: అంజయ్యనగర్​లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మూడోరోజు మంగళవారం కొనసాగాయి. తక్కువ స్థలంలో ఆరు, ఏడు అంతస్థుల్లో నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు భారీ యంత్రంతో పడగొడుతున్నారు. ఇక్కడ 50 గజాల్లో కట్టిన ఏడు అంతస్థుల భవనం కుప్పకూలిన నేపథ్యంలో స్థానికంగా 50, 60 గజాల విస్తీర్ణంలో ఉన్న 8 భవనాలను కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్​ప్రకటించారు.

ఇందులో భాగంగా మంగళవారం మరో భవన కూల్చివేత పనులను ప్రారంభించారు. ముందు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న స్టెర్లింగ్​వైట్​ఫీల్డ్​అపార్ట్​మెంట్​బీ బ్లాక్​లోని 30 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. ఇప్పటికే దెబ్బతన్న జయదర్శి అపార్ట్​మెంట్​సీ బ్లాక్​ నివాసితులు హోటళ్లలో, తెలిసిన వారి ఇండ్లలో ఆశ్రయం పొందుతున్నారు. కూల్చివేత పనులు మరో రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని,  ఆ తర్వాత అపార్ట్​మెంట్​నాణ్యత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.  

కుప్పకూలిన బిల్డింగ్​ కాంట్రాక్టర్ అరెస్ట్  

అంజయ్యనగర్​లో కుప్పకూలిన ఏడు అంతస్థుల భవన నిర్మాణ కాంట్రాక్టర్​ను రాయదుర్గం పోలీసులు మంగళవారం అరెస్ట్​ చేశారు. బిల్డర్​సాజీద్​ను విదేశాలకు పారిపోతుండగా శంషాబాద్​లో అరెస్ట్​చేసిన విషయం తెలిసిందే. గాజులరామారం కైసర్​నగర్​లోని ఇంట్లో కాంట్రాక్టర్​మహమ్మద్​ఖాజామియాను అదుపులోకి తీసుకొని, రిమాండ్​కు తరలించారు.