ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా మౌలిక వసతులు, వైద్య పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్య, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మౌలిక వసతులు, సివిల్ పనులు, వైద్య పరికరాలు, ల్యాబొరేటరీలు, డయాగ్నస్టిక్ హబ్‌లపై సమీక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సివిల్ పనులు చేపట్టాలని సూచించారు.
సత్తుపల్లి, మధిర ఏరియా ఆస్పత్రులకు వైద్య పరికరాల కోసం రూ.30 లక్షల చొప్పున, కల్లూరు సీహెచ్‌సీకి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, బీసీ మహిళలను ఆర్థికంగా స్వావలంబన కలిగిన మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీట్–పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లలో కలెక్టర్ జిల్లా ఆఫీసర్లతో కలిసి పాల్గొన్నారు.
