విద్య, వైద్యానికి ప్రభుత్వ ప్రాధాన్యత : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

విద్య, వైద్యానికి ప్రభుత్వ ప్రాధాన్యత : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌‌‌‌‌‌‌‌ను జిల్లా కలెక్టర్ దివాకర, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్యంపై చేసే ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి అన్నారు. 

వైద్య కళాశాల పూర్తయ్యే నాటికి మరో 200 పడకల ఆస్పత్రి అవసరమవుతుందని, స్థలాన్ని గుర్తిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి మంజూరు చేయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ దుర్గా ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేందర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. శంకర్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఖమ్మం హోల్‌‌‌‌‌‌‌‌సేల్ ఫ్రూట్ మర్చంట్ వెల్ఫేర్ యూనియన్ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఫ్రూట్ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు స్థలం, నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణాన్ని మూడు నుంచి ఐదు నెలల్లో పూర్తి చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ వి. హనుమంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేశ్​ను ఆదేశించారు. 

వెలుగుమట్ల అభివృద్ధి పనుల పరిశీలన..

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి, కలెక్టర్, సీపీ, మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలతో కూడిన మోడల్ కాలనీగా అభివృద్ధి చేసి పేదలకు గౌరవప్రదమైన జీవన వాతావరణం కల్పిస్తామన్నారు.