ఖమ్మం జిల్లాలో పశువుల కొవ్వుతో నూనె దందా.. 150 లీటర్ల కల్తీ నూనె సీజ్

ఖమ్మం జిల్లాలో పశువుల కొవ్వుతో నూనె దందా.. 150 లీటర్ల కల్తీ నూనె సీజ్

ముదిగొండ, వెలుగు:- ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో జంతువుల కొవ్వుతో నూనె తయారు చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫుడ్​ సేఫ్టీ అధికారులు 150 లీటర్ల కల్తీ నూనెను సీజ్​ చేశారు. 

వెంకటాపురంలోని ఓ ఇంటి వద్ద మాంసం విక్రయిస్తుండడంతో గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి స్రవంతి, సర్పంచ్  కందుల బాలచందర్​కు ఫిర్యాదు చేశారు. వారు అక్కడ పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్నట్లు గుర్తించి, ఖమ్మం ఫుడ్​ సేఫ్టీ అధికారి శరత్ కు సమాచారం ఇచ్చారు. 

తనిఖీలు నిర్వహించి షేక్  సర్వర్  జానీ, అతని సోదరుడు అన్వర్  జానీ పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 150 లీటర్ల నూనెను సీజ్​ చేశారు. ఈ నూనెను ఎవరు కొనుగోలు చేస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఎందుకు వాడుతున్నారు? ఎంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతోందనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు ఫుడ్​ సేఫ్టీ అధికారి శరత్  తెలిపారు.